వెతలే.. వేతనాల్లేవ్!
ABN , Publish Date - May 09 , 2026 | 05:53 AM
సకాలంలో వేతనాలు అందక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు విభాగాల్లో ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వాపోతున్నారు.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఆలస్యం
పైగా, ప్రభుత్వం నుంచి ఇంకా వెలువడని కొనసాగింపు ఉత్తర్వులు
దీంతో, అందరికీ ఏప్రిల్ నెల వేతనాలను నిలిపివేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ
నీటిపారుదల శాఖ, పలు ఆరోగ్య విభాగాల్లో 5 నెలలుగా చెల్లింపుల్లేవు!
కొన్ని శాఖల్లో నిధులు వచ్చినా ఏజెన్సీలు ఆపుతున్నాయన్న ఆరోపణలు
ఆందోళనలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు..ఏజెన్సీల రద్దుకు డిమాండ్
నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మే 8 (ఆంధ్ర జ్యోతి): సకాలంలో వేతనాలు అందక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు విభాగాల్లో ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వాపోతున్నారు. దీనికి తోడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా కొనసాగింపు ఉత్తర్వులు రాలేదు. ఫలితంగా ఆర్థిక శాఖ ఏప్రిల్ నెల జీతాలను నిలిపివేసింది. దీంతో, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లైంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. ఒక్క నీటి పారుదల శాఖలోనే దాదాపు 500మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో.. వర్క్ ఇన్‌స్పెక్టర్ల నుంచి కంప్యూటర్ ఆపరేటర్ల వరకు వివిధ స్థాయుల్లో పనిచేస్తున్నారు. వీరికి ఐదు నెలలుగా జీతాలు చెల్లించలేదు. 104 హెల్త్ సర్వీస్ విభాగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు నాలుగు నెలలుగా వేతనాలివ్వలేదని చెప్తున్నారు. బీసీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మార్చి నెల జీతం అందలేదు. భద్రాది కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రిలో ఒక ఏజెన్సీ పరిధిలో 73 మంది పని చేస్తున్నారు. వారికి సంబంధించి రూ.15.96లక్షల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. 5 నెలల నుంచి జీతాలను చెల్లించడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్‌లకు సంబంధించి ఏడాది కాలానికి రూ.42.81లక్షలు చెల్లించాల్సి ఉన్నా అదీ చెల్లించలేదని.. మొత్తం మీద రూ.58.77లక్షల బకాయిలు ఉన్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతి నెలా 15వ తేదీ లోపు అందాల్సిన వేతనాలు నెలలు గడిచినా రావడం లేదని చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా మధ్యలో ఉండే ఏజెన్సీలు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్న ఆరోపణలున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల మంది ఉద్యోగులు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో సుమారు 3లక్షల మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ తామంటే అందరికీ అలుసేనని వారు ఆవేదన చెందుతున్నారు. గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా గుర్తింపు లేదని చెబుతున్నారు. అందుకే ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే పారిశుధ్య, సెక్యూరిటీ, పేషంట్‌కేర్ సిబ్బంది తమ కనీస వేతనాన్ని ప్రస్తుతం ఉన్న రూ.15వేల నుంచి రూ.26వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్‌లో నిరసన తెలిపారు. మున్సిపల్, విద్యుత్తు శాఖలో పని చేస్తున్న సిబ్బంది సకాలంలో జీతాలు రావడం లేదని, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినా, నివేదికలు ఇంకా తుది దశలోనే ఉన్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రూ.700కోట్ల బకాయిలు
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు సుమారు రూ.700 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగులు చెప్తున్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖల్లోనే అత్యధిక బకాయిలు ఉన్నాయని, బకాయిల చెల్లింపుల కోసం ఎన్ని పర్యాయాలు అధికారులను కలిసినాతమ గోడు పట్టించుకోవడం లేదన్నారు. ఏజెన్సీలు రద్దు చేసి నేరుగా ఉద్యోగులకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఒక వైపు వేతనాలు ఇవ్వడం లేదని, మరో వైపు ఏజెన్సీలను రద్దు చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.