టీజీఎంఎస్ఐడీసీ ఈడీపై బదిలీ వేటు
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:36 AM
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్ఐడీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) కౌటిల్య రెడ్డిపై ప్రభుత్వం మంగళవారం బదిలీ వేటు వేసింది.
ప్రక్షాళన దిశగా ఔషధ కార్పోరేషన్
మరికొందరిపైనా చర్యలు
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్ఐడీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) కౌటిల్య రెడ్డిపై ప్రభుత్వం మంగళవారం బదిలీ వేటు వేసింది. ఆయన్ను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి సరెండర్ చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి పెద్దల అండదండలతో ఆయన సంస్థలో అడుగుపెట్టారు. కౌటిల్య రెడ్డిని టీజీఎంఎ్‌సఐడీసీ ఈడీగా నియమిస్తూ 2022 మార్చి 22న అప్పటి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వ్యులు జారీ చేశారు. కౌటిల్య రెడ్డి నాలుగేళ్లుగా సంస్థలో అదే హోదాలో పనిచేశారు. అయితే, కొద్దినెలలుగా ఆయనపై ముఖ్యమంత్రి కార్యాలయానికి, వైద్య ఆరోగ్యశాఖమంత్రికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలకు టెండర్లు దక్కేందుకు నిబంధనలు మార్చారని, అలాగే రేటు కాంట్రాక్టు కొద్దిరోజుల్లో ముగిసే ఒక ఔషధాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారని, గతంలో వినియోగించని ఔషధాలను కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి, అవి ఎక్స్‌ఫైరీ కావడం... తదితర అంశాలపై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. ఒకవైపు విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగా, ఆయనపై బదిలీ వేటు పడడం వైద్య ఆరోగ్యశాఖలో చర్చనీయాంశంగా మారింది. కాగా కార్పోరేషన్‌లో చోటు చేసుకుంటున్న అవకతవకలు, అక్రమాలు, విజిలెన్స్ విచారణ అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.
ఔషధ కార్పొరేషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఆ సంస్థ ఎండీని ఆదేశించినట్లు సమాచారం. ఏళ్లుగా కార్పోరేషన్‌లో పాతుకుపోయిన వారి వివరాలను ఇప్పటికే సేకరించారు. ఇందులో ఒకరిద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు సుమారు దశాబ్దకాలంగా కార్పొరేషన్‌లో పాతుకుపోయి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా తమకు అనుకూలమైన కంపెనీల కోసం ప్రత్యర్థి కంపెనీల ఉత్పత్తులను నాన్ స్టాండర్డ్ క్వాలిటీ(ఎన్‌ఎస్‌క్యూ)గా చేయడంలో సదరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో కూడా తేలింది. అలాగే, ఫైనాన్స్ వ్యవహారంలో డబ్బులిస్తేనే బిల్లులు పెడుతున్నట్లు కూడా సర్కారు దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై కూడా ప్రభుత్వం సీరియె్‌సగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంస్థ నుంచి పలువురికి ఉద్వాసన, మరికొందరిని బదిలీ చేయనున్నట్లు సమాచారం.