నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - May 01 , 2026 | 05:30 AM
వానాకాలం సాగు సమయానికి రైతులకు అవసరమైనంత మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని, విత్తన నాణ్యత విషయంలో రాజీపడకుండా సరఫరా చేయాలని అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులకు వ్యవసాయశాఖ...
టాస్క్‌ఫోర్స్ ద్వారా వాటిని అరికట్టాలి
రైతులకు నాణ్యమైన విత్తనాలే అందాలి
సమీక్షలో మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగు సమయానికి రైతులకు అవసరమైనంత మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని, విత్తన నాణ్యత విషయంలో రాజీపడకుండా సరఫరా చేయాలని అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. విత్తనాల నిల్వ, సరఫరాపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసుశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటుచేసి అక్రమ నిల్వలు, రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా ఉండగా.. ఇందుకు 104 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరమని, రాష్ట్రంలో 212.11 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కంపెనీలు తమ విత్తనాలను ఈ నెల 15 నుంచిరైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వచ్చే వానాకాలంలో 1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి రూ.134 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్షలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వే్‌షరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, డైరెక్టర్ డాక్టర్ బి. గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్‌బాషా, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మలతో డెవల్‌పమెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధులు గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. వాతావరణ పరిస్థితులపై రైతులకు సమయానుకూల సలహాలు అందించే దిశగా వారు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కాగా, అధిక దిగుబడి రావటంతోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని తుమ్మల అన్నారు. గురువారం సచివాలయలో రైస్‌మిల్లర్ల సంఘం నేతలు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పొడవు గింజ వరి రకాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఎంటీయూ- 1010, కేఎన్‌ఎం- 118, ఐఆర్-64 లాంటి రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ ఎగుమతులకు పనికిరావటంలేదని అన్నారు. మనరాష్ట్రంలో సన్నరకాలుగా పరిగణించే కొన్నిరకాలు ఎఫ్‌సీఐ గ్రేడ్- ఏ పరిధిలోకి రావటంలేదని, ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఈ సందర్భంగా రైస్‌మిల్లర్లు కోరారు.