Share News

ప్రభుత్వ ఆఫీస్‌లకు ‘టీ-ఫైబర్‌’తోనే ఇంటర్‌నెట్‌

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:21 AM

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబరు 1నుంచి కేవలం టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్‌నెట్‌ సేవలు అందించాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆఫీస్‌లకు ‘టీ-ఫైబర్‌’తోనే ఇంటర్‌నెట్‌

  • ఫ్యూచర్‌ సిటీకి కూడా ఇదే అందించాలి

  • వచ్చేనెల నుంచి ప్రైవేటు నెట్‌ ఆపరేటర్లకు బిల్లులు ఇవ్వద్దు

  • ఇంటింటికీ ఇంటర్‌నెట్‌.. 2 నెలల్లో కార్యాచరణ

  • లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్ల భాగస్వామ్యంతో కనెక్షన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ఆగష్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబరు 1నుంచి కేవలం టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్‌నెట్‌ సేవలు అందించాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. అప్పటినుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్‌నెట్‌ సేవల కోసం ప్రైవేటు ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని స్పష్టంచేశారు. మంగళవారం సచివాలయంలో ‘టీ-ఫైబర్‌’పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌, టీ-ఫైబర్‌ ఎండీ వేణుప్రసాద్‌లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడిచిన ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేశామని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.13కోట్లు ఆదా అయిందన్నారు. మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సేవలను విస్తరించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ స్టేట్‌ వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌ (టీ-స్వాన్‌)ను నెల రోజుల్లో పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్‌సిటీకి పూర్తిస్థాయిలో ఇంటర్‌నెట్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీ-ఫైబర్‌’కు సూచించారు. టీ-ఫైబర్‌ నెట్‌ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300-400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని, అంతేకాకుం డా పూర్తిస్థాయిలో డేటాకు సెక్యూరిటీ ఉంటుందని తెలిపారు. రాష్ట్రం లో ఇంటింటికీ ఇంటర్‌నెట్‌ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే రెండు నెలల్లోనే ఇందుకు కార్యాచరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్ల భాగస్వామ్యంతో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించినట్టు తెలిసింది.


పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పీహెచ్‌డీ

పరిశ్రమల అవసరాలకు, విద్యాసంస్థల్లో జరిగే పరిశోధనలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌, బిట్స్‌ పిలానీ, ఆస్ట్రేలియాకు చెందిన ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ సంయుక్తంగా ‘ఇండస్ర్టీ-ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ అండ్‌ రీసెర్చ్‌ ప్రోగ్రాం’ను ప్రారంభించాయి. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలనే పరిశోధనాంశాలుగా తీసుకోవడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ప్రముఖ లైఫ్‌ సైన్సెస్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) పనిచేస్తున్న నిపుణులు తమ ఉద్యోగాలను కొనసాగిస్తూనే అంతర్జాతీయ స్థాయి పర్యవేక్షణలో డాక్టోరల్‌ పరిశోధనలు చేపట్టేందుకు అవకాశం కల్పించనున్నారు. ఆయా కంపెనీలు తమ ఉద్యోగులు, పరిశోధకులను స్పాన్సర్‌ చేయనుండగా.. బిట్స్‌ పిలానీ, ఆర్‌ఎంఐటీ వర్సిటీలు అకడమిక్‌ పర్యవేక్షణ, అంతర్జాతీయ నైపుణ్యం, రీసెర్చ్‌ మెంటార్‌షి్‌పను అందించనున్నాయి. తద్వారా పరిశ్రమలకు ఉపయోగపడే పరిశోధనలు, టెక్నాలజీ బదిలీకి ఊతమివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ అలెక్‌ కామెరాన్‌, బిట్స్‌ పిలానీ గ్రూప్‌ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.రామ్‌గోపాల్‌రావు, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ సీఈవో సర్వేష్‌ సింగ్‌తోపాటు సాండోజ్‌, బీఎంఎస్‌, ఎంఎ్‌సడీ, సనోఫీ, నోవార్టిస్‌ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 05:23 AM