ఇంధన సరఫరా 10-15 శాతం పెంచాలి!
ABN , Publish Date - May 01 , 2026 | 05:27 AM
రాష్ట్రంలో ప్రతిరోజు సాధారణంగా సరఫరా చేసే ఇంధనం కంటే 10 నుంచి 15 శాతం అదనంగా సరఫరా పెంచాలని, అన్ని పెట్రోల్ బంకుల్లో నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ....
ఓఎంసీలకు స్టీఫెన్ రవీంద్ర ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిరోజు సాధారణంగా సరఫరా చేసే ఇంధనం కంటే 10 నుంచి 15 శాతం అదనంగా సరఫరా పెంచాలని, అన్ని పెట్రోల్ బంకుల్లో నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను(ఓఎంసీ) రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. గురువారం పౌరసరఫరాల భవన్‌లో ఓఎంసీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేశారు. యాసంగి వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో డీజిల్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఏ ఒక్క బంకులోనూ నిల్వలు లేవనే ఫిర్యాదు రాకూడదని స్పష్టం చేశారు. సెలవుదినాలు.. పగలు.. రాత్రి.. అనే తేడా లేకుండా 24 గంటలు సరఫరా చేయాల్సిందేనని ఆదేశించారు. నో-స్టాక్ బోర్డు పెట్టడానికి వీలులేదని, ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెట్లో విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని ఓఎంసీలను హెచ్చరించారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని స్టీఫెన్ రవీంద్ర సూచించారు. కాగా, యాసంగి సీజన్‌లో 10.2 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు.