ఆయిల్‌పామ్ సాగుతో డబ్బులే డబ్బుల్!
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:59 AM
పామాయుల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటానికి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించటానికి, రైతులకు ఆదాయాన్ని పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోంది.
ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల ఆదాయం.. తొలి నాలుగేళ్లకు సర్కారు ఇచ్చే రాయితీ రూ.46,200
25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు పంట దిగుబడి
ప్రస్తుతం రాష్ట్రంలో 2.94 లక్షల ఎకరాల్లో పంట
దేశవ్యాప్తంగా సాగులో తెలంగాణ 36 శాతం వాటా
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): పామాయుల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటానికి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించటానికి, రైతులకు ఆదాయాన్ని పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఒక్కసారి ఆయిల్‌పామ్ మొక్కలు నాటితే మూడేళ్ల తర్వాత 25-30 ఏళ్ల వరకు ప్రతియేటా దిగుబడి వస్తుందని, ఎకరానికి సుమారు రూ. 2లక్షల చొప్పున ఆదాయం వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పంటను గణనీయంగా విస్తరించాలని భావిస్తున్న ప్రభుత్వం.. శుక్రవారం ఒక ప్రకటన జారీచేసింది. రైతులకు ఆర్థిక పరిపుష్టిని కలిగించటానికి ఆయిల్‌పామ్‌ను మించిన పంటలేదని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,448 మంది రైతులు 2.94 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుచేస్తున్నారని, దీంతో 36 శాతం వాటాతో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జాతీయ నూనె గింజల పథకంలో గడిచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 6.82 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులోకి వస్తే.. తెలంగాణ విస్తీర్ణం 2.94 లక్షల ఎకరాలకు చేరుకుందని వెల్లడించింది. దేశీయ పామాయిల్ ఉత్పత్తిలో 98 శాతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరుగుతోందని, ప్రస్తుతం దేశంలో 15.70 లక్షల ఎకరాలు సాగులో ఉన్నదని, స్వయం సమృద్ధి సాధించాలంటే... 70 లక్షల ఎకరాలకు పెరగాల్సి ఉన్నదని ప్రభుత్వం లెక్కలు వెల్లడించింది. సాగును ప్రోత్సహించటానికి డ్రిప్ ఇరిగేషన్, యాజమాన్యం, అంతర పంటల సాగుకోసం ఏడాదికి రూ. 46,250 చొప్పున నాలుగేళ్లపాటు సబ్సిడీ పంపిణీ చేస్తామని కూడా ప్రభుత్వం వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి టన్ను గెలల ధర రూ. 12,534 ఉండగా... ఇప్పుడు రూ.23,852కు పెరిగింది. దేశంలోనే అత్యధికంగా 20.01 శాతం క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి ఇక్కడి గెలల నుంచి జరుగుతోందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాదిలో 79,621 ఎకరాల్లో పామాయిల్ తోటల సాగుకు 23,082 మంది రైతులు నమోదుచేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 14 ఆయిల్ పామ్ కంపెనీల మొక్కల సరఫరాకు 45 నర్సరీలు ఏర్పాటుచేశారు. కొత్తగూడెం జిల్లాలో 2, సిద్దిపేట జిల్లాలో ఒకటి కలిపి మూడు మిల్లుల్లో ప్రాసెసింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో మరో ఆరు మిల్లులు నిర్మాణంలో ఉన్నాయని, ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం, కొణిజర్ల, గద్వాల జిల్లా బీచ్‌పల్లి, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి జిల్లాలోని పెద్దరాత్‌పల్లి, వనపర్తి జిల్లాలోని సంకిరెడ్డిపల్లిలో మిల్లుల నిర్మాణాలు పురోగతిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
టన్ను ఆయిల్‌పామ్ గెలలకు
కనీస మద్దతు ధర రూ.25వేలు ఉండాలి
దక్షిణాది వ్యవసాయ మంత్రులతో ప్రధానిని కలుస్తా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ గెలలకు కనీస మద్దతు ధర టన్నుకు రూ.25వేలు ఉండాలని.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌కు సుంకాన్ని కనీసం 44శాతం పెంచాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న పామాయిల్ కర్మాగారాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏటా రూ.లక్ష కోట్ల విదేశీ పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీనిని నివారించాలంటే ఇంకా 70లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాల్సి ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రధాని మోదీని దక్షిణాది వ్యవసాయ మంత్రులమంతా కలవనున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ పంటకు ఉన్న ప్రాధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.