‘ఇవేం మినిట్స్’
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:40 AM
తెలంగాణ, ఏపీల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ గత జనవరి 30న ఢిల్లీలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా చర్చించిన అంశాలతో రూపొందించిన మినిట్స్‌లో...
కోర్టుల్లో చర్చలకు, ఉత్తరప్రత్యుత్తరాలకు వినియోగించొద్దు
జలవివాద పరిష్కార కమిటీ మినిట్స్‌పై అభ్యంతరం
కేంద్ర జలవనరుల సంఘానికి తెలంగాణ ఘాటు లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఏపీల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ గత జనవరి 30న ఢిల్లీలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా చర్చించిన అంశాలతో రూపొందించిన మినిట్స్‌లో అవాస్తవాలున్నాయని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్ అధ్యక్షతన ఈకమిటీని కేంద్ర జలశక్తిశాఖ ఏర్పాటు చేసింది. సీడబ్ల్యూసీ సభ్యకార్యదర్శి, కృష్ణాబోర్డు సభ్యులు ఇచ్చిన ప్రజెంటేషన్లలోని పలు అభిప్రాయాలు అవాస్తవమని, కోర్టులు, ట్రైబ్యునళ్లు వీటిని రిఫరెన్స్‌లుగా తీసుకుంటే తమ వాదనలకు నష్టం జరుగుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం/రాష్ట్రం/ఇతర సంస్థ కూడా ఇందులో పేర్కొన్న అసంపూర్ణ చర్చలను ఏ కోర్టులోనూ చర్చ, ఉత్తరప్రత్యుత్తరాలకు వాడకూడదని చెప్పింది. మినిట్స్‌లోని పేరా 8(1),(2)తో మినహా ఇతర అంశాలను అంగీకరించబోమంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్ విభాగం డైరెక్టర్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్ లేఖ రాశారు.
గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు అక్కడినుంచి పెన్నాకు తరలించడానికి ఏపీ చేసిన పోలవరం -బనకచర్ల ఎత్తిపోతల ప్రతిపాదనలు.. సహజన్యాయ సూత్రాలకు విరుద్థమని చెప్పినప్పటికీ మినిట్స్‌లో చేర్చలేదన్నారు. వరద జలాలపై ప్రతిపాదించిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల పరిశీలనకు మార్గదర్శకాలు లేవని, ఏ విధంగా వీటిని మదింపు చేస్తున్నారన్నారు. గోదావరి పరీవాహకంలో నీటి లభ్యతను నిర్థారించడం గానీ, పరీవాహకంలోని రాష్ట్రాలకు నిర్దిష్ట పరిమాణంలో కేటాయింపులు జరపడం కానీ గోదావరి ట్రైబ్యునల్ చేయలేదని మినిట్స్‌లో సీడబ్ల్యూసీ పేర్కొనడం సరైంది కాదన్నారు. వివిధ అంతర్రాష్ట్ర ఒప్పందాల ఆధారంగా గోదావరి ట్రైబ్యునల్ పరీవాహక ప్రాంత రాష్ట్రాలకు నిర్దేశిత ప్రాంతాల వద్ద నీటి లభ్యత ఆధారంగా సరైన పరిమాణంతో కూడిన నిబంధనల రూపంలో నీటి కేటాయింపులు చేసిందని, గోదావరి ట్రైబ్యునల్ తీర్పుకి జత చేసిన అనుబంధం-బీలో వివిధ సబ్ బేసిన్లలోని నీటి వినియోగంపై స్పష్టత ఉందన్నారు.
2023 జూన్‌లో సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం గోదావరి పరీవాహకంలో 75శాతం డిపెండబుల్టీ 3397 టీఎంసీల లభ్యత ఉందని, ఇందులో ఉమ్మడి ఏపీకి 1435 టీఎంసీలు లభ్యతలోకి ఉన్నాయన్నారు. కాళేశ్వరం, సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల వంటి ఎన్నో ప్రాజెక్టులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు 75శాతం లభ్యత ఆధారంగా ట్రైబ్యునల్ నిర్దేశించిన నీటి పరిమాణాల ఆధారంగా సీడబ్ల్యూసీ అనుమతులిచ్చింది. మినిట్స్‌లోని అంశాల్లో అవాస్తవాలను సరిచేయాలన్నారు. మిగులు జలాలను దిగువ రాష్ట్రాలు వాడుకునే ేస్వచ్ఛను ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రైబ్యునల్-1 కేటాయించిందని, దీంతో ఎన్నో ప్రాజెక్టులను చేపట్టారని, ప్రస్తుత ఏపీలో కొన్ని పూర్తికాగా... కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. బచావత్ ట్రైబ్యునల్(కృష్ణా-1) ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించిందని, దీని ఆధారంగానే ఎస్‌ఆర్‌బీసీ, బీమాఎత్తిపోతల పథకాలకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌లు ఇచ్చిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌నూ అదే ప్రాతిపదికన దాఖలు చేశామన్నారు. దీనిపై కృష్ణాబోర్డు వ్యాఖ్యలను తొలగించాలన్నారు. కృష్ణాబోర్డుకు వినియోగాన్ని నియంత్రించడం, లెక్కలుతీసే బాధ్యత ఉందన్నారు.