ఎన్‌హెచ్-65 విస్తరణ పనులు త్వరగా చేపట్టండి
ABN , Publish Date - May 11 , 2026 | 06:13 AM
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను..
ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌ను కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను.. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ప్రధానంగా రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్-65) విస్తరణ పనులపై చర్చించారు. నిత్యం ప్రమాదాలతో డెత్ రోడ్‌గా మారిన ఎన్‌హెచ్-65 రోడ్డును 8 వరుసలుగా విస్తరించే పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇదే ఎన్‌హెచ్-65 మార్గంలోని ఎల్‌బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7 కి.మీ. మేర నాగపూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు డీపీఆర్‌ను కేంద్రానికి అందించినట్టు తెలిపారు. వీటితో పాటు ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, చేపట్టబోయే మరికొన్ని ఇతర ప్రాజెక్టుల గురించి కూడా మంత్రి.. ఛైర్మన్‌తో చర్చించారు. కాగా, హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ, రీజినల్ రింగు రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన టెండర్ ప్రక్రియలను అతి త్వరలో పూర్తిచేసి, పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.