స్టేషన్ బెయిల్‌కు రూ.లక్ష డిమాండ్
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:59 AM
ఓ వ్యక్తి నుంచి గాంధీనగర్ ఎస్సై నరసింహులు రూ.50వేల నగదును లంచంగా తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెండ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు..
ఏసీబీ వలలో గాంధీనగర్ ఎస్సై
50వేలు తీసుకుంటుండగా పట్టివేత
కవాడిగూడ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి నుంచి గాంధీనగర్ ఎస్సై నరసింహులు రూ.50వేల నగదును లంచంగా తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెండ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్ రేంజ్-1 ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అన్నదమ్ముల మద్య జరిగిన గొడవ విషయంలో స్టేషన్ బెయిల్ (నోటీసు) ఇచ్చేందుకు నరసింహులు రూ.లక్ష డిమాండ్ చేశారు. గాంధీనగర్ పరిధిలో నివాసం ఉండే సంజీవ్‌సింగ్ ఠాకూర్, అతడి సోదరుడి మధ్య వ్యాపార లావాదేవీలకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 11న అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. సోదరుడి ఫిర్యాదు మేరకు ఈనెల 11న గాంధీనగర్ పోలీసులు సంజీవ్‌సింగ్ ఠాకూర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాను పూర్తిగా అనుకూలంగా వ్యవహరించాలన్నా, స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్నా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నా తనకు లంచంగా రూ.లక్ష ఇవ్వాలని సంజీవ్ సింగ్ ఠాకూర్‌ను నరసింహులు డిమాండ్ చేశారు. ఇందులో మొదటి విడతగా రూ.50వేలను కవాడిగూడ పరమేశ్వర దేవాలయం వద్ద సంజీవ్ నుంచి నరసింహులు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నరసింహులుపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో గాంధీనగర్ పోలీ్‌సస్టేషన్‌లో ఇంకెవరి పాత్రయినా ఉందా? అనే విషయపైనా విచారణ చేస్తామని, నరసింహులు ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తామని మాజిద్ అలీ ఖాన్ చెప్పారు.