గుంత తవ్వుతుంటే కేబుల్ తెగిందా జైలుకే..!
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:46 AM
రోడ్డు, డ్రైనేజీ లేదా ఇతర నిర్మాణాల కోసమో రోడ్డు పక్కన గుంత తవ్వుతున్నారా? అయితే ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తవ్వుతామంటే కుదరదు.
2 కోట్ల వరకు జరిమానాకూ అవకాశం
రాష్ట్రంలో టెలికం కేబుళ్ల పరిరక్షణకు కొత్త నిబంధనలు
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రోడ్డు, డ్రైనేజీ లేదా ఇతర నిర్మాణాల కోసమో రోడ్డు పక్కన గుంత తవ్వుతున్నారా? అయితే ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తవ్వుతామంటే కుదరదు. ఎందుకంటే భూగర్భ కేబుళ్ల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం.. గుంత తవ్వుతుండగా కేబుల్ తెగిందంటే బాధ్యులు జైలుకు వెళ్లాల్సి రావచ్చు. రూ.2 కోట్ల వరకు జరిమానా కూడా పడొచ్చు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ల చట్టం-2023, టెలికమ్యూనికేషన్ల (రైట్ ఆఫ్ వే) రూల్స్-2024ను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు శనివారం జీవో ఎంఎస్-3 జారీ చేసింది. సాధారణంగా రోడ్డు, పైప్‌లైన్, డ్రైనేజీ, భవన నిర్మాణ పనుల్లో తవ్వేటప్పుడు భూగర్భ కేబుళ్లపై పెద్దగా దృష్టి ఉండదు. ఇకపై తవ్వకం మొదలుపెట్టే ముందు అక్కడ భూగర్భ టెలికం కేబుళ్లు ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలను సమన్వయం చేసుకోవాలి. దీనికి ‘కాల్ బిఫోర్ యూ డిగ్ (సీబీయుడీ)’ మొబైల్ యాప్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రభుత్వ సంస్థలు, కాంట్రాక్టర్లు 30 రోజుల్లోగా ఈ యాప్‌లో రిజిస్టర్ కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు కచ్చితంగా ఈ నిబంధన పాటించాలి.
ఉల్లంఘిస్తే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయనున్నారు. ఎక్కడైనా కేబుళ్లు తెగినట్టు నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2 కోట్ల వరకు జరిమానా.. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. దీంతోపాటు నష్ట పరిహారం, ఇతర సివిల్ పెనాల్టీలు కూడా చెల్లించాల్సి రావచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఏర్పాటుచేస్తున్న భారత్‌నెట్‌ను (టీ-ఫైబర్) ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించారు. ప్రభుత్వ ఆస్తులపై భారత్‌నెట్, ఇతర నోటిఫై చేసిన ప్రత్యేక టెలికం ప్రాజెక్టుల మౌలిక వసతులకు ఫీజు, అద్దె, యాన్యుటీ, బ్యాంక్ గ్యారంటీ వంటి ఆర్థిక భారం మోపకూడదని ప్రభుత్వం పేర్కొంది. కాగా, రాష్ట్రంలో 2026 మార్చి 31లోపు అందిన రైట్ ఆఫ్ వే దరఖాస్తులను సెప్టెంబరు 30లోపు పరిష్కరించాలని గడువు విధించింది.