కొత్త రేషన్ కార్డుకు.. 9 రక్షణ కవచాలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 06:25 AM
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో రేషన్‌కార్డుల ప్రామాణికతను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నకిలీలు, అక్రమ కాపీలకు అడ్డుకట్ట వేసేలా కొత్త ఆహార భద్రతా కార్డుల (రేషన్‌కార్డు)ను రూపొందిస్తోంది.
నకిలీలకు చెక్‌పెట్టేలా సెక్యూరిటీ ఫీచర్లు
కార్డుపై హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్, వాటర్‌మార్క్
డూప్లికేట్ చేయలేవిధంగా భద్రతా ఫీచర్లు
లబ్ధిదారుల గుర్తింపు, కార్డు ప్రామాణికతకు కొత్త విధానం
హైదరాబాద్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎ్‌స)లో రేషన్‌కార్డుల ప్రామాణికతను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నకిలీలు, అక్రమ కాపీలకు అడ్డుకట్ట వేసేలా కొత్త ఆహార భద్రతా కార్డుల (రేషన్‌కార్డు)ను రూపొందిస్తోంది. కొత్త కార్డుల్లో 9 అధునాతన భద్రతాంశాలను పొందుపరుస్తోంది. కంటికి కనిపించని, స్పర్శ ద్వారా గుర్తించే, డిజిటల్‌గా ధ్రువీకరించే సాంకేతికతలను వాడుతోంది. కార్డు ముందు భాగంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సంతకాన్ని పొందుపరుస్తారు. కార్డు వెనుక భాగంలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. కార్డుపై ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ అనే అక్షరాలను పైకి ఉబ్బినట్లుగా ముద్రించే రిలీఫ్ టెక్స్ట్ ఉంటుంది. చేతితో తాకి దీనిని గుర్తించవచ్చు. కార్డులో సూక్ష్మ అక్షరాలను కూడా ఉపయోగించారు. అత్యంత చిన్న అక్షరాల్లో ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ పదాలను పునరావృతంగా ముద్రిస్తారు. ఇవి సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించకపోయినా మాగ్నిఫికేషన్‌తో పరిశీలించవచ్చు. ‘డ్యూయల్ హిడెన్ ఇమేజ్’ అనే సాంకేతికతను కూడా కార్డులో వినియోగిస్తున్నారు. ఒకదానిపై మరొకటి సూపర్ ఇంపోజ్ చేసిన అక్షరాలు లేదా గుర్తులు నిర్దిష్ట కోణంలో లేదా మాగ్నిఫికేషన్‌తో పరిశీలించినప్పుడు కనిపించేలా రూపొందించారు. ఇందులో ‘జీవో టీజీ ఒరిజినల్’ వంటి రహస్య గుర్తులను చూపించారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్‌మార్క్‌ను కూడా కార్డుపై పొందుపరిచారు. ఈ వాటర్‌మార్క్‌ను వెలుతురుకు ఎదురుగా ఉంచినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.
కార్డుపై ఇన్విజిబుల్ యూవీ లోగోను కూడా ఏర్పాటు చేశారు. ఈ లోగో అల్ర్టావయెలెట్ కాంతి కింద మాత్రమే కనిపిస్తుంది. కార్డు వెనుక భాగంలో ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. కార్డులోని సమాచారాన్ని అనధికారికంగా కాపీ చేయడం, మార్చడం లేదా డూప్లికేట్ చేయడాన్ని నిరోధించడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కార్డు బ్యాక్‌గ్రౌండ్‌లో సంక్లిష్టమైన గీల్లొష్ ప్యాటర్న్‌ను ఉపయోగించారు. క్లిష్టమైన డిజైన్ కారణంగా దీని నకలు రూపొందించడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు.