నేటి నుంచి భూములకు కొత్త విలువ
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:32 AM
సవరించిన భూముల విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని, ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకునే వారు నూతన విలువల ప్రకారమే స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు...
అభ్యంతరాల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబరు.. రిజిస్ట్రేషన్ల శాఖలో చాలా మార్పులు తెచ్చాం
సబ్ రిజిస్ట్రార్ల అధికారాలు తగ్గించాం
మంత్రిగా 3,500 ఫైళ్లను క్లియర్ చేశా
ఏ ఫైల్‌పైనా గుడ్డిగా సంతకం పెట్టలేదు
ఫ్యూచర్ సిటీని ఏ ప్రభుత్వమూ రద్దు చేయలేదు
ఒకవేళ చేస్తే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది: పొంగులేటి
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్ర జ్యోతి): సవరించిన భూముల విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని, ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకునే వారు నూతన విలువల ప్రకారమే స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాస్ర్తీయ పద్ధతిలో భూముల విలువలు సవరించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువలు ఎకరాకు రూ.2.75 లక్షలు, మునిసిపల్ కార్పొరేషన్లలో ఎకరాకు రూ.5లక్షలు, హెచ్‌ఎండీఏ పరిధిలో ఎకరాకు రూ.10లక్షలు, ఓఆర్‌ఆర్ లోపల ఎకరాకు రూ.15 లక్షల చొప్పున కనిష్ఠ విలువ నిర్ణయించామన్నారు. సవరించిన భూముల విలువలపై అభ్యంతరాలు తెలిపేందుకు టోల్‌ఫ్రీ నంబరు(1800 599 4788)ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. వాట్సాప్ నంబరు (8247619983)కు సైతం ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో సబ్‌రిజిస్ర్టార్ల అధికారాలు తగ్గించామన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి దేవుడి దయతో ఇక్కడి వరకు వచ్చానని, తనకు ఏ శాఖ ఇచ్చినా మనస్పూర్తిగా పని చేస్తానని చెప్పారు. రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడిన వారిపై గత పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తప్పు చేసిన వారిపై విచారణ చేపట్టకుండా.. తప్పించాలని చూశారని దుయ్యబట్టారు. నాలుగేళ్లపాటు ఫైళ్లను తొక్కిపెట్టారని చెప్పారు. రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 3,500 పైళ్లు క్లియర్ చేశానని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా నిర్ణయాలు తీసుకున్నానని వెల్లడించారు.
ఏ ఒక్క ఫైల్‌పైనా తాను గుడ్డిగా సంతకాలు చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వచ్చేవి కాదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అసైన్డ్ భూములను సైతం రిజిస్ట్రేషన్ చేశారని, తామొచ్చాక వాటిని 22ఏ(నిషేధిత జాబితా)లో పెట్టామన్నారు. భూములకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ను డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. ఒక వేళ రద్దు చేస్తే పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏడాదిన్నరలో 90 శాతం గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని, అసైన్డ్ భూములకు పాలసీ తెస్తామని వివరించారు. కాగా, గచ్చిబౌలి తాలిమ్‌లో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయ పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఈ భవనాన్ని డిసెంబరులోపు అందుబాటులోకి తెస్తామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మార్పులు తీసుకొస్తున్నామన్నారు. తొలి దశలో ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 39సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలను 13 క్లస్టర్లుగా విభజించి, ప్రభుత్వంపై భారం లేకుండా ప్రైవేటు నిర్మాణ సంస్థల సహకారంతో ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 4 ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల ఇంటి కల నెరవేర్చే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లకు రూ.7వేల కోట్లు చెల్లించామని వివరించారు.