Share News

కొత్త ఆయకట్టుకు నీరందేనా?

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:17 AM

రెండేళ్లలో 10,22,045 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలని టార్గెట్‌గా పెట్టుకోగా లక్ష్యం 1,00,524 ఎకరాలకే చేరుకుంది. సీతారామ ఎత్తిపోతల పథకంలో 111818 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ జరిగిందని....

కొత్త ఆయకట్టుకు నీరందేనా?

  • లక్ష్యానికి దూరంగా పనులు, నిధులు

  • 10.22లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యం

  • సాధించిన ఆయకట్టు లక్ష ఎకరాలే

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో 10,22,045 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలని టార్గెట్‌గా పెట్టుకోగా లక్ష్యం 1,00,524 ఎకరాలకే చేరుకుంది. సీతారామ ఎత్తిపోతల పథకంలో 111818 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ జరిగిందని, సదర్‌మఠ్‌ బ్యారేజీ కింద 18016 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నట్లు నీటి పారుదలశాఖ ప్రకటించింది. 2024-25లో 526061 ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించాలని టార్గెట్‌గా పెట్టుకోగా ప్రాజెక్టుల నిర్మాణాలకు వెచ్చించిన నిధులు కేవలం రూ.6946 కోట్లే. ఇక 2025-26లో 495984 ఎకరాలకు ఆయకట్టును సాధించాలని అనుకోగా 50413 ఎకరాలకే చేరుకుంది. 2025-26లో ప్రాజెక్టుల పనులకు రూ.11786 కోట్లు వెచ్చించినట్లు ప్రకటించగా ఆ నిధులన్నీ పెండింగ్‌ బిల్లుల ఖాతాలోకే వెళ్లాయి. కృష్ణా బేసిన్‌లో అత్యంత కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. 2023 దాకా నాలుగేళ్లపాటు ప్రాజెక్టు పనులు సాగలేదు. 2023లో ఒక్క మోటార్‌ను ఆన్‌ చేసి ఆ తర్వాత ఆఫ్‌ చేశారు. ప్రాజెక్టుకు కరెంట్‌ కనెక్షన్‌ కూడా కట్‌ చేశారు. కృష్ణా బేసిన్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఇది. నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌, నారాయణపేట్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 70 మండలాలకు చెందిన 1226 గ్రామాలకు తాగునీటితో పాటు హైదరాబాద్‌ జంటనగరాలకు తాగునీటిని అందించడానికి చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం ప్రాజెక్టుకు శాపంగా మారింది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే 64 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను నింపుకొవొచ్చు. ఓపెన్‌ కెనాల్‌లో ఏకంగా 5 టీఎంసీలకు పైగా నీటిని కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉండగా గడిచిన రెండేళ్లలో ప్రాజెక్టులో పురోగతి లేదు. దాదాపు రూ.1300 కోట్ల దాకా బిల్లులు బకాయిలు కూడా ఉన్నాయి. మరో రూ.50 కోట్ల దాకా ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన బిల్లు అలాగే ఉంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన ప్యాకేజీ-3 నార్లాపూర్‌-ఏదుల లింక్‌ కెనాల్‌ పనులు గడిచిన నాలుగేళ్లుగా నత్తనడకన జరుగుతున్నాయి. గోదావరిలో మరో కీలక ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులు కూడా నిరాశజనకంగానే నడుస్తున్నాయి. సీతమ్మసాగర్‌కు పర్యావరణ అనుమతి రావాల్సి ఉంది. దీనిపై యంత్రాంగం దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక గోదావరిలో అంతరాష్ట్ర ప్రాజెక్టు పెద్దవాగును డ్రిప్‌ పథకం కింద మరమ్మతులు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపినా స్థానిక యంత్రాంగానికి ఇది ఇష్టం లేదు.


నిధుల్లేకుండా ప్రాజెక్టులు పూర్తయ్యేదెట్లా?

ప్రాజెక్టుల పనులు పూర్తికావాలంటే నిధులే కీలకం. రెండేళ్లలో ప్రభుత్వం పరిమిత లక్ష్యాలతో తక్కువ వ్యయంతో, ఎక్కువ ఆయకట్టు టార్గెట్‌గా పెట్టుకోగా నిధులు మాత్రం ఆ దిశగా విడుదల కాలే దు. నిర్దేశించుకున్న నిధులన్నీ మధ్యలోనే ప్రాధాన్యం లేని ప్రాజెక్టుల ఖాతాలో చేరాయని విమర్శలు వస్తున్నాయి. రెండేళ్లపాటు ప్రాధాన్య ప్రాజెక్టులకు ఆశించిన నిధులు అందక పోగా రానున్న 36 నెలల కాలం(ఈనెల 1నుంచి 2029 మార్చి 31దాకా) ఏకం గా 15.09 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీటిని అందించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీనికోసం నిధులు ఇవ్వకపోతే నిర్దేశిత ఆయకట్టును సాధించే అవకాశాలు లేవని క్షేత్రస్థాయి యంత్రాంగం చెబుతుంది. ఇప్పటికైనా ప్రాధాన్య ప్రాజె క్టులకైనా నిధులు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 04:17 AM