రూ.4.43 లక్షల కోట్ల రుణాలు అవసరం
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:23 AM
రాష్ట్రంలోని వివిధ రంగాలకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.4.43 లక్షల కోట్ల రుణాల అవసరం ఉందని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డ్) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం....
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.54 లక్షల కోట్లు కావాలి
చిన్న పరిశ్రమలకు రూ.2.4 లక్షల కోట్లు
2026-27లో రాష్ట్ర రుణ సామర్థ్యంపై నాబార్డ్ అంచనా
2025-26 కంటే 15 శాతం అధికం
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ రంగాలకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.4.43 లక్షల కోట్ల రుణాల అవసరం ఉందని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డ్) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) కంటే 15 శాతం అధిక రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించింది. నాబార్డు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర రుణ సామర్థ్య సదస్సును నిర్వహించింది. ఇందులో రాష్ట్ర రుణ సామర్థ్య పత్రాన్ని విడుదల చేసింది. సదస్సులో తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకుడు చిన్మయ్ కుమార్, ఎస్‌బీఐ డీజీఎం ప్రియబ్రత మిశ్రా, నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ్‌భాస్కర్ పాల్గొన్నారు. వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకు, మౌలిక సదుపాయాలు, సేవల రంగాలకు రుణాల అవసరం బాగా పెరిగిందని తేల్చింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎ్‌సఎల్‌బీసీ)లో సభ్యులైన వాణిజ్య, గ్రామీణ, సహకార బ్యాంకులు తమ వార్షిక రుణ ప్రణాళికల(ఏసీపీ)ను రూపొందించుకోవడానికి రుణ సామర్థ్య పత్రం ఉపయోగపడుతుందని వివరించింది. రాష్ట్రంలో అన్ని రంగాలకు కలిపి మొత్తం రూ.4,43,314.86 కోట్ల రుణాలు అవసరమవుతాయని తెలిపింది. ఇందులో వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, దాని అనుబంధ రంగాలకు రూ.1,54,293.28 కోట్ల రుణాల అవసరం ఉందని చెప్పింది. పంటల మార్పిడి పద్ధతిని, వాతావరణానికి అనుకూలమైన పంటల సాగును అనుసరించాలని నాబార్డు రైతులకు సూచించింది. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు రాష్ట్రంలో ఎక్కువగా పండుతున్నాయని, వీటికి రుణాల అవసరం ఉందని తెలిపింది. సాగునీటి పారుదల సదుపాయాలు, ఎత్తిపోతల పథకాలు, చెక్ డ్యామ్‌లు, సూక్ష్మ సేద్యానికి రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ డిమాండ్ పెరిగిందని, దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగే అవకాశముందని తెలిపింది. యాంత్రీకరణ కోసం రూ.6,399 కోట్ల మేర రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని లెక్క వేసింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎ్‌ఫపీఓ) ద్వారా రాష్ట్రంలో మామిడి పండ్లు, పసుపు, మిర్చి పంటల రైతులకు రూ.6,565 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని సూచించింది. గోదాములు, కోల్డ్ చెయిన్‌లు, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం మరో రూ.7,806 కోట్ల రుణాలు అవసరమని తెలిపింది.
చిన్న పరిశ్రలకు రూ.2,39,546 కోట్ల రుణాలు అవసరమని, ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చేనేత, చేతిపని, వస్త్రాల తయారీ, ఔషధాలు, ఐటీ, సంప్రదాయేతర ఇంధన వనరులకు రుణాలు ఇవ్వాలని చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూలోత్పత్తి(జీఎ్‌సడీపీ) రూ.16.41 లక్షల కోట్లుగా ఉందని వివరించింది. అంతకు ముందు సంవత్సరం కంటే 12.25 శాతం అధికమని, భౌగోళికంగా దేశంలో 11వ స్థానం, జనాభాపరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ)కి 4.9 శాతం వాటాను అందిస్తోందని వివరించింది. నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, ఫోకస్ పేపర్ వివిధ బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళికలకు ఆధారమవుతుందని తెలిపారు. 33 జిల్లాల్లో రంగాల వారీగా, ప్రాంతాల వారీగా రుణ అవసరాన్ని అంచనా వేశామన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ, కౌలు రైతులకు రుణాలివ్వాలని బ్యాంకర్లకు సూచించారు. సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 పత్రాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. నాబార్డు ఫోకస్ పేపర్ కూడా తెలంగాణ రైజింగ్ పత్రానికి అనుగుణంగా ఉందని అన్నారు. వ్యవసాయ రంగం జీఎ్‌సడీపీకి 16-17 శాతం వాటాను అందిస్తోందని, రాష్ట్రంలో ఇప్పటికీ 46 శాతం మందికి ఉపాధి వ్యవసాయ రంగం నుంచే ఉందని వివరించారు.