అనైతిక పొత్తులు
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:48 AM
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని.. అధికారమే పరమావధి అని మరోసారి రుజువైంది! కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్.. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు.
పలు మునిసిపాలిటీల్లో ప్రధాన పార్టీల మిలాఖత్
ఇస్నాపూర్‌లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ ఓటు
జిన్నారంలో బీఆర్‌ఎస్‌తో, నర్సాపూర్‌లో కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు
కామారెడ్డిలో పదవులు పంచుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్
ఆమన్‌గల్లులో కాంగ్రెస్‌లో చేరి, బీజేపీ మద్దతుతో చైర్మన్ అయినబీఆర్‌ఎస్ అభ్యర్థి
ఎల్లంపేటలో బీఆర్‌ఎస్‌కు, ఆలియాబాద్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు
నిజామాబాద్, ఆమనగల్లు, ఆదిలాబాద్, రంగారెడ్డి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని.. అధికారమే పరమావధి అని మరోసారి రుజువైంది! కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్.. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు. అన్ని జిల్లాల్లో పలు మునిసిపాలిటీల్లో అధికారం దక్కించుకోవడం కోసం.. సిద్ధాంతాలను పక్కన పెట్టి ఈ పార్టీలు మిలాఖత్ అయిన తీరే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌లో మేయర్ ఎన్నిక కోసం కాంగ్రె్‌సకు ఎంఐఎంతోపాటు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. కామారెడ్డి మునిసిపాలిటీని కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో కైవసం చేసుకుంది. అక్కడ కాంగ్రె్‌సకు బీఆర్‌ఎ్‌సకు చెందిన 11 మంది మద్దతు తెలపడంతో చైర్‌పర్సన్‌గా ఉమారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసర్ల గోదావరికి కాంగ్రె్‌సకు చెందిన 22మంది కౌన్సిలర్లు మద్దతిచ్చారు. ఇక, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మునిసిపాలిటీ 6వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికైన నేనావత్ పత్యనాయక్ సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరి మధ్యాహ్నం చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన్ను చైర్మన్ చేయడంలో.. కాంగ్రె్‌సకు బీజేపీ మద్దతివ్వడం గమనార్హం. ఇక్కడ బీఆర్‌ఎ్‌సకు 8, బీజేపీకి ఆరు, కాంగ్రె్‌సకు ఒక స్థానం చొప్పున దక్కాయి. అధిక సీట్లు దక్కించుకున్న బీఆర్‌ఎస్.. చైర్మన్‌గా తమ పార్టీకి చెందిన పాపిశెట్టి రాము పేరును ప్రకటించింది. గెలుపొందిన కౌన్సిలర్లను కాం్యపునకు తరలించింది.
అంతలోనే ఏం జరిగిందో ఏమో.. ఆ శిబిరం నుంచి 6వ వార్డు కౌన్సిలర్ పత్యనాయక్ ఆదివారం సాయంత్రం బయటకు వచ్చారు. సోమవారం ఉదయం నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆ పార్టీ.. పత్యనాయక్ పేరును చైర్మన్ పదవికి ప్రతిపాదించింది. అక్కడ అప్పటికే బీజేపీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వైస్ చైర్‌పర్సన్ పదవిని బీజేపీకి ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మేరకు.. కాంగ్రెస్ నుంచి చైర్మన్‌గా పత్యనాయక్, వైస్ చైర్‌పర్సన్‌గా తల్లోజు గీత ఎన్నికయ్యారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఆలియాబాద్ మునిసిపాలిటీలోనూ కాంగ్రెస్, బీజేపీ ఒక ఒప్పందానికి వచ్చి పదవులను పంచుకున్నాయి. అక్కడ చైర్‌పర్సన్‌గా కాంగ్రె్‌సకు చెందిన కమతం శిరీషా కృష్ణారెడ్డి, వైస్‌చైర్‌పర్సన్‌గా బీజేపీకి చెందిన కన్‌రెడ్డి మాలతి ఎన్నికయ్యారు. అదే జిల్లా ఎల్లంపేట మునిసిపాలిటీలో.. బీఆర్‌ఎస్, బీజేపీ పదవులను పంచుకున్నాయి. అక్కడ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి లావుడ్య శ్రీదేవి (ఎస్టీ), వైస్ చైర్‌పర్సన్‌గా మేకల రజిత ఎన్నికయ్యారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మునిసిపాలిటీలో 26 వార్డులకుగాను బీఆర్‌ఎస్ 12, కాంగ్రెస్ 10 గెలుచుకోగా.. స్వతంత్రులు నలుగురు గెలిచారు. వీరిలో ఒక బీఆర్‌ఎస్ కౌన్సిలర్, ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ శిబిరంలో చేరారు. అదే సమయంలో.. ఒక స్వతంత్ర అభ్యర్థితోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్‌ను బీఆర్‌ఎస్ తీసుకోవడంతో ఆ పార్టీ బలం పదమూడుకు పెరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్‌ఎస్ బలం 14కు చేరింది. అయినా అనుమానంతో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు మద్దతును కూడగట్టారు. దీంతో.. ఆర్థిక వనరులున్న ఇస్నాపూర్ సీటు బీఆర్‌ఎస్ ఖాతాలో పడింది. బీఆర్‌ఎస్ కౌన్సిలర్ మోటె సుమలత చైర్‌పర్సన్‌గా.. కాంగ్రెస్ కౌన్సిలర్ పట్లోల్ల మాధవి వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యన దోబూచులాడిన చైర్మన్ పదవి.. చివరకు బీజేపీ మద్దతుతో కాంగ్రె్‌సనే వరించింది. అక్కడ కాంగ్రె్‌సకు చైర్మన్, బీజేపీకి వైస్‌చైర్మన్ పదవులు దక్కాయి. జిన్నారంలో.. బీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మద్దతు లేక బీజేపీతో దోస్తీ కట్టింది. అక్కడ బీఆర్‌ఎస్ చైర్మన్ పదవి దక్కించుకోగా.. బీజేపీ అభ్యర్థికి వైస్ చైర్మన్ పదవి దక్కింది.
ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలో..
రాయికల్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ మద్దతుతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అక్కడ 12 స్థానాలకు గాను కాంగ్రెస్ 3, బీజేపీ 5, బీఆర్‌ఎస్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 7 ఏ పార్టీకి రాలేదు. అయితే.. కాంగ్రె్‌సకు చెందిన ముగ్గురు కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్‌ఎ్‌సకు చెందిన కట్కం రవి అనే కౌన్సిలర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక మెట్‌పల్లిలో.. బీజేపీ అభ్యర్థి మద్దతుతో కాంగ్రె్‌సపార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. అక్కడ 26 స్థానాలకుగాను.. బీజేపీ 10, బీఆర్‌ఎస్ 6, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి. నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 14 ఏ పార్టీకీ రాలేదు. చైర్మన్ ఎన్నికలో.. కాంగ్రెస్ అభ్యర్థి మైలారపు లింబాద్రికి ఆ పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు, నలుగురు స్వతంత్రులతోపాటు బీజేపీకి చెందిన చెట్లపల్లి మీనా అనే కౌన్సిలర్ ఓటు వేయడంతో ఆయన చైర్మన్‌గా గెలుపొందారు. విప్ జారీ చేయకపోవడం వల్లనే చెట్లపల్లి మీనా కాంగ్రె్‌సకు ఓటు వేశారంటూ.. బీజేపీ కౌన్సిలర్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యాదగిరిబాబు నివాసంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో కొంత ఉద్రికత్త నెలకొంది.
కాంగ్రెస్ మద్దతుతో బీఆర్‌ఎస్..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో.. కాంగ్రె్‌సకు చెందిన ఒక అభ్యర్థి అనూహ్య మద్దతుతో బీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అక్కడ 20 స్థానాలకుగాను.. బీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం రచించింది. అయితే.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అబ్దుల్లాకు 10 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థికి ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఉన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఓటుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 13వ వార్డు అభ్యర్థి గుండా స్నేహ ఓటు కూడా పడడంతో అనూహ్యంగా కారు పార్టీకి చైర్మన్ పదవి దక్కినట్టయింది. ఇక.. బెల్లంపల్లి మునిసిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులతోపాటు, బీజేపీ అభ ్యర్థి మద్దతు కూడగట్టి చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. అక్కడ మొత్తం 34 వార్డులుండగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెరో 14 సీట్లు వచ్చాయి. దీంతో చైర్మన్ పదవి కోసం రెండు పార్టీల నాయకులూ పట్టుబట్టారు. ఎక్స్ అఫీషియో సభ్యుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అప్రమత్తమై స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురితో పాటు బీజేపీ అభ్యర్థి మద్దతు కూడగట్టడంతో కథ సుఖాంతం అయింది.