పాలకవర్గాలు కొలువుదీరేది నేడే
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:26 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఎన్నికల్లో కీలక ఘట్టమైన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికనూ చేపట్టనున్నారు.
కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఎన్నికల్లో కీలక ఘట్టమైన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికనూ చేపట్టనున్నారు. ముందుగా.. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు సంబంధించి నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లను కలుపుకొని ఈ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏవైనా సమస్యలు ఎదురైనా, అనివార్య కారణాల వల్ల ఎన్నిక పూర్తికాకపోయినా.. మరుసటి రోజు (ఈనెల 17న) ఈ ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన వార్డులు/డివిజన్ల సంఖ్యకు అనుగుణంగా.. చైర్మన్, వైస్‌చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సరైన కోరం ఉన్నచోట్ల ప్రక్రియ సాఫీగా సాగే అవకాశం ఉంది. కోరం తక్కువగా ఉండటం, తమ పార్టీ సభ్యులు పక్క పార్టీకి వెళ్తారన్న సందేహం ఉన్న చోట్ల కొత్తగా ఎన్నికైన సభ్యులను ఆయా పార్టీలు క్యాంపులకు తరలించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులతోపాటు మద్దతుదారులనూ గోవా, బెంగుళూరు తదితర ప్రాంతాలకు తరలించింది. బీజేపీ, బీఆర్‌ఎస్ సైతం తమ పార్టీల తరఫున ఎన్నికైన వారితోపాటు తమకు మద్దతునిస్తామన్న సభ్యులను స్థానికంగా, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు తరలించి క్యాంపుల్లోనే ఉంచాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు వారిని క్యాంపుల నుంచి నేరుగా మునిసిపల్ కార్యాలయాలకు తీసుకురానున్నారు. తద్వారా వారు చేజారిపోకుండా.. తాము నిర్ణయించిన చైర్మన్, మేయర్‌లను ఎన్నుకునేలా ప్రధాన పార్టీలు తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ పరోక్ష ఎన్నికలో చేతులెత్తే విధానం ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.