Share News

పోలింగ్‌ అయ్యేదాకా పంచుడే!

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:57 AM

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ రోజున నోట్ల వర్షం కురిసింది. పోలింగ్‌ రెండు రోజుల ముందు నుంచి పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరులు...

పోలింగ్‌ అయ్యేదాకా పంచుడే!

  • ఇళ్లకు వెళ్లి కొందరికి, కేంద్రాల వద్ద మరికొందరికి..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ రోజున నోట్ల వర్షం కురిసింది. పోలింగ్‌ రెండు రోజుల ముందు నుంచి పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరులు... బుధవారం పోలింగ్‌ ముగిసే సమయం వరకూ కొనసాగించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కావటం, కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు, రెండు ఓట్లతో కూడా ఫలితాలు తారుమారయ్యే పరిస్థితులు ఉండటంతో ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. చివరి క్షణం వరకు సాధ్యమైనన్ని ఓట్లు వేయించటానికి శాయశక్తులా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ రోజున దూర ప్రాంతాల నుంచి వచ్చిన నాన్‌ లోకల్‌ ఓటర్లపై దృష్టి పెట్టిన అభర్థులు, అనుచరులు... వారిని వచ్చీరాగానే పట్టుకున్నారు. ఓటర్లు కూడా ఊర్లో అడుగుపెట్టగానే ‘అన్నా.. మేమొచ్చినం, అక్కా.. మేమొచ్చినం...’ అంటూ అభ్యర్థులకు ఫోన్లు చేశారు. దీంతో అభ్యర్థులు, వారి అనుచరులు వెళ్లి డబ్బులు ముట్టజెప్పారు. కొందరు ఓటర్లకు చీరెలు, సారెలు, కుంకుమ భరిణెలు, మద్యం బాటిళ్లు, మాంసం కవర్లు కూడా పంచారు. కొందరైతే ‘నిన్న మా వార్డులో వారికి అంతిచ్చారు? అంతదూరం నుంచి వస్తే మాకు ఇంతేనా?’ అని అభ్యర్థులతో కొట్లాడి మరీ డబ్బులు తీసుకున్నారు. విచ్రితమేమిటంటే.. కొందరు ఓటర్లు అన్ని పార్టీల అభ్యర్థులతోనూ టచ్‌లో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థుల నుంచి కూడా డబ్బులు డిమాండ్‌ చేసి తీసుకున్నారు. చివరి సమయంలో పోలింగ్‌ కేంద్రాల సమీపంలో కూడా డబ్బుల పంపకాలు జోరుగా జరగటం గమనార్హం. కాగా, ముందే ఇంటింటి సర్వే చేసుకొని స్థానికంగా ఎవరున్నారు? ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో ఎవరెవరు ఉంటున్నారో తెలుసుకొని జాబితాలు తయారు చేశారు. వారి ఫోన్‌ నెంబర్లు సేకరించారు. పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు నుంచే ఫోన్లు చేశారు. ఎలాగైనా వచ్చి తమకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రయాణ ఖర్చులకు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు ముట్టజెప్పారు. హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో ఉండేవారితోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉంటున్న వారికి కూడా ఫోన్లు చేసి ఓటేయడానికి రావాలని కోరారు. హైదరాబాద్‌లో ఎక్కువ మంది ఓటర్లు ఒకే ప్రాంతంలో ఉన్నట్లయితే అభ్యర్థులు కొద్దిరోజుల ముందే కలిసివెళ్లారు. కాగా, స్థానికంగా ఉంటున్నవారికి మంగళవారం నుంచే పంపకాలు మొదలుపెట్టి ఓటుకు సగటున రూ.1,000 నుంచి రూ.2,500 వరకు ఇచ్చారు. మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులైతే రూ.3 వేల నుంచి రూ. 5 వేల చొప్పున పంపిణీ చేశారు.

Updated Date - Feb 12 , 2026 | 02:57 AM