16న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:11 AM
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పోరేషన్లకు ఈ నెల 16న చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది...
అదే రోజున ప్రమాణ స్వీకారం
కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రక్రియ
మెజారిటీ సభ్యుల మద్దతుతో పదవి
ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు
పార్టీలకు విప్ జారీ చేసే హక్కు
వేరే పార్టీ వారికి మద్దతిస్తే సభ్యత్వం రద్దు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పోరేషన్లకు ఈ నెల 16న చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. అదేరోజున ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం ఈ ప్రక్రియ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడనున్నాయి. గెలుపొందిన కౌన్సిలర్లు/కార్పొరేటర్లతో ఈ నెల 16 ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక, తర్వాత వైస్ చైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇందుకోసం సంబంధిత మున్సిపాలిటీ/కార్పొరేషన్ పరిధిలోని మొత్తం సభ్యుల్లో కనీసం సగం మందికిపైన హాజరుకావాల్సి ఉంటుంది. సంబంధిత చైర్‌పర్సన్/మేయర్ పదవికి నిర్ణయించిన రిజర్వేషన్ వర్తించే కౌన్సిలర్లు/కార్పొరేటర్లకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. పోటీలో ఉన్నవారికి మద్దతుగా చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ (డ్రా) ద్వారా విజేతను నిర్ణయిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రక్రియ జరుగుతుంది.
పార్టీ విప్ ఉల్లంఘిస్తే సభ్యత్వం రద్దు
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తమ కౌన్సిలర్లు/కార్పొరేటర్లు ఎవరికి ఓటు వేయాలన్న దానిపై విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. విప్‌ను ఉల్లంఘించి, వేరే అభ్యర్థికి ఓటు వేసిన కౌన్సిలర్లు/కార్పొరేటర్ల సభ్యత్వం రద్దవుతుంది. సంబంధిత రాజకీయ పార్టీ ఫిర్యాదు మేరకు కలెక్టర్లు ఈ చర్య తీసుకుంటారు. అయితే సదరు సభ్యుడు వేసిన ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది.
ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం..
చైర్‌పర్సన్/మేయర్ ఎన్నికల్లో ఎక్స్-అఫీషియో సభ్యులు (ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు) కీలకం కానున్నారు. ఎన్నికకు ముందే.. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సంబంధిత మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేషన్, మునిసిపాలిటీలోనైనా ఒకచోట తమ పేరు నమోదు చేసుకోవచ్చు. లోక్‌సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గం పరిధిలో ఏదో ఒక మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో పేరు నమోదు చేసుకుని ఓటు వేయవచ్చు.