Share News

పట్టణాలపై కాంగ్రెస్‌దే పట్టు

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:58 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం సాధించనుందని వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల్లో తేలింది.

పట్టణాలపై కాంగ్రెస్‌దే పట్టు

  • వంద పట్టణాల్లో పాగాకు అవకాశం

  • ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం సాధించనుందని వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల్లో తేలింది. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా.. సుమారు 100 పట్టణాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఆయా సంస్థలు అంచనా వేశాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ జోరు అధికంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండగా, ఉత్తర తెలంగాణలో కాంగ్రె్‌సకు బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు సర్వేలు తెలిపాయి. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డిలలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా ఉందని వెల్లడించాయి. భైంసాలో ఎంఐఎం గెలుస్తుందని పల్స్‌ టుడే సంస్థ అంచనా వేసింది. నిజామాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. కరీంనగర్‌లో 66 డివిజన్లు ఉండగా, 29 చోట్ల బీజేపీ గెలిచే అవకాశం ఉందని తెలిపింది. నల్లగొండలో కాంగ్రెస్‌ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మంచిర్యాల, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెం కార్పొరేషన్లను అధికార పార్టీనే కైవసం చేసుకుంటుందని పేర్కొంది. రామగుండం కార్పొరేషన్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు తెలిపిన అభ్యర్థులు 10-12 డివిజన్లలో గెలుస్తారని వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ నిజామాబాద్‌, కరీంనగర్‌, రామగుండం, కొత్తగూడెం కార్పొరేషన్లలో మూడో స్థానానికే పరిమితం కానున్నట్లు అంచనా వేసింది. ఆపరేషన్‌ చాణక్య సంస్థ తన ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం డివిజన్లలో 48 శాతం గెలుచుకుంటుందని పేర్కొంది. బీఆర్‌ఎస్‌ 26 శాతం, బీజేపీ 13 శాతం, ఎంఐఎం 6 శాతం డివిజన్లలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. 7 కార్పొరేషన్లలో ఆరింటిని కాంగ్రెస్‌ చేజిక్కించుకుంటుందని వెల్లడించింది.

అధికార పార్టీ హవాకు కారణాలివే..

పురపోరులో అధికార కాంగ్రె్‌సదిపైచేయి కావడానికి అనేక కారణాలున్నాయని ఎగ్జిట్‌పోల్స్‌ సంస్థలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉండటంతో, ఈ ఎన్నికల్లో విపక్ష పార్టీలు గెలిచినా అభివృద్ధి చేయలేవని, అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని పట్టణ ఓటర్లు నమ్మినట్లు పేర్కొన్నాయి. ఎంఐఎం పోటీ చేయని చోట్ల మైనార్టీలంతా కాంగ్రె్‌సకు అండగా నిలిచినట్లు సమాచారం.

Updated Date - Feb 12 , 2026 | 02:58 AM