9 రోజుల్లో 961కోట్లు!
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:42 AM
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు నెలకొల్పాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు...
మునిసిపల్ ఎన్నికలకు మద్యం కిక్కుఇది గత ఏడాది కంటే 31ు అధికం
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు నెలకొల్పాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు (తొమ్మిది రోజుల్లోనే) రూ.961 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం విశేషం. ఈ లెక్కన రోజుకు రూ.100కోట్ల చొప్పున అమ్మకాలు జరిగాయి. ఈ నెల 8వ తేదీ వరకు(8రోజులపాటు) జరిగిన అమ్మకాలు రూ.881 కోట్లు కాగా.. గత ఏడాది ఇదే ఎనిమిది రోజుల కాలంలో రూ.672 కోట్ల అమ్మకాలే జరిగాయి. అంటే.. ఏకంగా 31శాతం వృద్ధి నమోదైంది. వారం రోజుల్లోనే పోటీలో ఉన్న అభ్యర్థుల జేబుల నుంచి రూ.209 కోట్లు మద్యం దుకాణాలకు చేరాయి. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల వేడి ప్రారంభమైనప్పటి నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు కిటకిటలాడుతుండగా.. అభ్యర్థులు తమ గెలుపు కోసం గుట్టుచప్పుడు కాకుండా మద్యం పంపిణీ చేయడంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.205 కోట్ల అమ్మకాలు జరగ్గా, సోమవారం రూ.173కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. వాస్తవానికి మునిసిపల్ ఎన్నికల ప్రభావం జనవరి నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది జనవరిలో రూ.2,984 కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది జనవరిలో అవి రూ.3,325కోట్లకు పెరిగాయి. అంటే ఆ ఒక్క నెలలోనే రూ.341 కోట్ల వృద్ధి నమోదైంది. పోలింగ్‌కు ఒక్క రోజు ముందు అంటే.. మంగళవారం సాయంత్రం వరకు రూ.79 కోట్ల విక్రయాలు జరిగాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది నేతలు ముందస్తుగా మద్యం నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం విక్రయాల ధోరణిని పరిశీలిస్తే.. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎక్కువగా లిక్కర్‌కే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు 8.46లక్షల కేసుల లిక్కర్ అమ్ముడవగా.. గత ఏడాది అమ్మింది 6.29 లక్షల కేసులు మాత్రమే. అంటే.. లిక్కర్ విక్రయాల్లో 34శాతం పెరుగుదల ఉంది. మరోవైపు బీర్ల విక్రయాలు గత ఏడాది 12లక్షల కేసులపైగా ఉండగా.. ఈ సారి 9.5లక్షల కేసులకు పడిపోయింది.