మునిసిపల్ ఎన్నికల వేళ.. ఖజానా కళకళ
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:02 AM
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూస్ నిబంధన పెట్టడం పురపాలక శాఖకు కలిసొచ్చింది. 7కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో బరిలోకి దిగిలానుకునేఅభ్యర్ధుల్లో...
నో డ్యూస్ నిబంధనతో రెండు రోజుల్లో 22 కోట్ల ఆదాయం
జనవరి నెలలో 60 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్న సీడీఎంఏ
హైదరాబాద్, ఫిబ్రవరి 5(ఆంధ్ర జ్యోతి): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూస్ నిబంధన పెట్టడం పురపాలక శాఖకు కలిసొచ్చింది. 7కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో బరిలోకి దిగిలానుకునేఅభ్యర్ధుల్లో బకాయిలు ఉన్న వారికి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ఎన్నికల్లో పోటీపడే వారి పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బకాయిలను చకచకా చెల్లించారు. జనవరి 28 నుంచి 30 తేదీ లోపు రూ.22 కోట్ల బకాయిలు చెల్లించారు. నిజామాబాద్‌లో మేయర్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఒకరు రూ.7.5 కోట్లు ఒకేసారి చెల్లించారు. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ వంటి ప్రధాన కార్పొరేషన్ల నుంచి ఎక్కువ బకాయిలు చెల్లించారు. ఎన్నికల పుణ్యమా అని రాజకీయ నాయకుల మొండి బకాయిలన్ని సులువుగా వసూలు అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. ఎన్నికల నేపథ్యంలో 7కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో నెల రోజుల వ్యవధిలో రూ.60 కోట్లు వసూలయ్యాయి. బకాయిలను రాబట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వన్‌టైం సెటిల్‌మెంట్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆస్తి పన్నుపై వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వాలని పురపాలక శాఖ నిర్ణయించింది.