Share News

రేపు పోలింగ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:16 AM

రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లలోని 414 డివిజన్లు, 116 మునిసిపాలిటీల్లోని 2,582 వార్డులకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.

రేపు పోలింగ్‌కు సర్వం సిద్ధం

  • ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లతో ఎస్‌ఈసీ రాణి కుముదిని సమీక్ష

  • ముగిసిన మునిసిపోల్స్‌ ప్రచారం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లలోని 414 డివిజన్లు, 116 మునిసిపాలిటీల్లోని 2,582 వార్డులకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణకు నియమించిన అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు, మెదక్‌, సిద్దిపేట, ఖమ్మం, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రంగారెడ్డి, ములుగు, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్లతో సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలింగ్‌ సిబ్బంది, వెబ్‌ కాస్టింగ్‌, పోలీసు బందోబస్తు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడారు. 8,203 పోలింగ్‌ కేంద్రాలకు మంగళవారం సాయంత్రం వరకు పోలింగ్‌ సిబ్బంది చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 16,031 బ్యాలెట్‌ బాక్సులను, ఇతర పోలింగ్‌ సామగ్రిని పోలింగ్‌ స్టేషన్లకు తరలించాలని చెప్పారు. పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌ రూములకు తరలించి, భద్రత కల్పించాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. 13న ఓట్ల లెక్కింపు జరిగే 136 కౌంటింగ్‌ కేంద్రాలను పోలీసు బలగాల ద్వారా ఎన్నికల విభాగాలు ముందుగానే ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు.


election.jpgelection-3.jpgelection-2.jpg

హద్దు మీరితే కఠిన చర్యలు..

ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్‌ హెచ్చరించారు. వివిధ మార్గాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, డబ్బులు, వస్తువులు పంచడం వంటివి చేయకూడదని చెప్పారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని, కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రచార సరళిపై పత్రికలు, న్యూస్‌ ఛానళ్లతోపాటు ఈసారి మొబైల్‌ఫోన్లు, సోషల్‌ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

Updated Date - Feb 10 , 2026 | 01:52 PM