ఫిబ్రవరి రెండో వారంలో పురపాలక ఎన్నికలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:29 AM
ఫిబ్రవరి రెండో వారంలో పురపాలక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, త్వరలో షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
త్వరలో షెడ్యూల్ విడుదలకు అవకాశం: మంత్రి ఉత్తమ్
నిజామాబాద్/మెట్‌పల్లి టౌన్, జనవరి25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఫిబ్రవరి రెండో వారంలో పురపాలక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, త్వరలో షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్‌తో కలిసి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మీడియాతోనూ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ ముందుకెళ్లాలని, టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి పనిచేస్తే పార్టీ అన్ని మునిసిపాలిటీలను, కార్పొరేషన్‌లను గెలుచుకుంటుందని చెప్పారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని, పార్టీ గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. ఎక్కడాలేనివిధంగా తెలంగాణలో పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.