Share News

చేజిక్కించుకోండి

ABN , Publish Date - Feb 15 , 2026 | 05:27 AM

రాష్ట్రంలో హంగ్‌ ఫలితాలు వచ్చిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను ‘చే’జిక్కించుకోవాలని.. కాంగ్రెస్‌కు సాఫీగా అధికారం దక్కేలా చూడాలని మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

చేజిక్కించుకోండి

  • హంగ్‌ వచ్చిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ కు సాఫీగా అధికారం దక్కాలి

  • ఏమాత్రం అవకాశమున్నా వదలొద్దు

  • ఎవరొచ్చినా కాదనకుండా పార్టీలో చేర్చుకోవాలి

  • కొత్తగూడెం సీపీఐకి.. భైంసా మజ్లి్‌సకు ఇద్దాం

  • మంత్రులు బాగా పనిచేశారు.. భేష్‌

  • పురపాలక సంఘాలను దేశంలోనే

  • ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడదాం

  • ఇదే ఊపుతో పరిషత్‌ సంగ్రామంలో గెలుద్దాం

  • త్వరలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!

  • మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హంగ్‌ ఫలితాలు వచ్చిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను ‘చే’జిక్కించుకోవాలని.. కాంగ్రెస్‌కు సాఫీగా అధికారం దక్కేలా చూడాలని మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏమాత్రం అవకాశమున్నా వదులుకోవద్దని.. పార్టీపై అభిమానంతో ఎవరొచ్చినా కాదనకుండా చేర్చుకోవాలని సూచించారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మజ్లిస్‌ తోడు అవసరమైన నేపథ్యంలో కాంగ్రెస్‌కు మేయర్‌, మజ్లిస్ కు డిప్యూటీ మేయర్‌ పదవులు దక్కేలా చూసుకోవాలని చెప్పారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌, బోధన్‌, జగిత్యాల, జహీరాబాద్‌లో మజ్లిస్‌ సహకారం తీసుకుని, భైంసా మునిసిపాలిటీని మజ్లిస్ కు ఇద్దామని నిర్దేశించారు. మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలపై శనివారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులతో సీఎం సమావేశమయ్యారు. భేటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, వివేక్‌ వెంకటస్వామి, మహ్మద్‌ అజారుద్దీన్‌, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్‌ఛైర్మన్‌ చిన్నారెడ్డి హాజరవగా, వర్చువల్‌ విధానంలో మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హంగ్‌ ఫలితాలు వచ్చిన మునిసిపాలిటీలపై చర్చించారు. హంగ్‌ ఫలితాలు వచ్చిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకునే బాధ్యతలను మంత్రులు, నేతలకు సీఎం అప్పగించారు.


నిజామాబాద్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ బాధ్యతను మంత్రి ఉత్తమ్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌కు, జగిత్యాల మున్సిపాలిటీ బాధ్యతలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు, కరీంనగర్‌ కార్పొరేషన్‌ బాధ్యతలు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లకు, జహీరాబాద్‌ బాధ్యతలు మంత్రి దామోదర రాజనర్సింహకు, బోధన్‌ బాధ్యతలు సలహాదారు సుదర్శన్‌రెడ్డికి అప్పగించారు. మిగతా చోట్ల కూడా పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని సూచించారు. పార్టీలో చేరేవారిని ఆహ్వానించాలని.. కాంగ్రెస్‌ పార్టీపై అభిమానంతో వచ్చేవారిని కాదనకుండా చేర్చుకోవాలని సీఎం నిర్దేశించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో స్వతంత్రులు, ఇతరుల మద్దతు లభిస్తే పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నించాలని, ఏ మాత్రం అవకాశమున్నా వదులుకోవద్దని మంత్రులకు సీఎం సూచించారు.


కొత్తగూడెం సీపీఐకే ఇద్దాం

కొత్తగూడెం కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఐ గణనీయ సంఖ్యలో సీట్లు సాధించిన నేపథ్యంలో ఆ పార్టీకే మేయర్‌ పదవి దక్కేలా సహకారం అందించాలని సీఎం సూచించారు. జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో సీపీఐతో అవగాహన ఉందని, వాస్తవానికి పురపాలక ఎన్నికలకు ముందే సీపీఐతో పొత్తు కుదుర్చుకోవాల్సి ఉన్నా స్థానిక పరిస్థితులతో సాధ్యం కాలేదని గుర్తు చేశారు. సీపీఐతో చర్చలు జరిపే బాధ్యతను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రి పొంగులేటి, ఏఐసీసీ కార్యదర్శి వంశీకి అప్పగించారు.

ఇదే ఊపుతో పరిషత్‌ ఎన్నికలకు..

రానున్న జిల్లా, మండల ప్రజాపరిషత్‌ ఎన్నికల్లో ఇదే ఊపుతో ముందుకు వెళ్లాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వీలుందని.. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల స్ఫూర్తితో విజయం సాధించేలా వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. అంతా కలసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపించిందని.. సంక్షేమ పథకాలు, ప్రజా పాలనపై ప్రజల నమ్మకానికి మున్సిపల్‌ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళదామని చెప్పారు. మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో వేగంగా అభివృద్ధి జరగాలని.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.


సీఎంతో సీపీఐ నేతల భేటీ

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఈటీ నర్సింహ తదితర నేతలు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికలో సీపీఐకి మద్దతు ఇవ్వాలని కోరారు.

Updated Date - Feb 15 , 2026 | 07:08 AM