మోగిన మునిసిపోల్స్ నగారా!
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:56 AM
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది.
116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 13న ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం విడుదల చేశారు. పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సభ్యులను ఎన్నుకొనేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243, తెలంగాణ మునిసిపాలిటీల చట్టం 2019 ప్రకారం ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళా ఓటర్లు 26.80 లక్షలు, పురుష ఓటర్లు 25.62 లక్షలు, ఇతరులు 640 మంది ఉన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా!
అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బుధవారమే కమిషనర్లు నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. 30వ తేదీ వరకు వరకు ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. బుధవారమే అన్ని వార్డుల పరిధిలో ఓటర్ల జాబితాను కూడా ప్రదర్శిస్తారు. 31న నామినేషన్లను పరిశీలించి, అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఫిబ్రవరి 1న అప్పీలు చేసుకోవచ్చు. మర్నాడు వారి అప్పీళ్లను పరిష్కరించి అర్హుల జాబితాను ఖరారు చేస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు పోటీ నుంచి తప్పుకోవాలనుకున్న అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఏడు కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవాంఛనీయ కారణాల వల్ల ఎక్కడైనా పోలింగ్ వాయిదా పడితే మర్నాడు(12వ తేదీ) పోలింగ్ నిర్వహిస్తారు. 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పది కార్పొరేషన్లు, 121 మునిసిపాలిటీలు ఉండగా పదవీకాలం పూర్తయిన 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా వాటికి పదవీకాలం పూర్తయ్యాక తర్వాత షెడ్యూల్‌లో ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ కార్పొరేషన్లలో ఎన్నికలు చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తి కానందున వాటి గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు జరుపుతారు. నకిరేకల్, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకు కూడా తర్వాత షెడ్యూల్‌లో నిర్వహిస్తున్నారు.
వార్డులు, రిజర్వేషన్ల కేటాయింపు ఇలా
ఏడు కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మునిసిపాలిటీల్లోని 2,582 వార్డులు కలిపి మొత్తం 2,996 మంది సభ్యులను ఎన్నుకోవడానికి పోలింగ్ నిర్వహించనున్నారు. అన్ రిజర్వుడ్ మహిళలకు అత్యధికంగా 864 స్థానాలు కేటాయించారు. అన్ రిజర్వుడ్‌కు 647 స్థానాలు కేటాయించారు. బీసీ జనరల్‌కు 463, బీసీ మహిళలకు 391 స్థానాలు దక్కాయి. ఎస్సీ జనరల్‌కు 254, ఎస్సీ మహిళలకు 190, ఎస్టీ జనరల్‌కు 147, ఎస్టీ మహిళలకు 40 సీట్లు కేటాయించారు.
16న మేయర్, చైర్‌పర్సన్ల ప్రమాణం
ఫిబ్రవరి 13న ఫలితాలను వెల్లడించిన తర్వాత జిల్లా కలెక్టర్లు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్‌పర్సన్లను ఎన్నుకునేందుకు 14న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 16న ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికైన వెంటనే ప్రమాణ స్వీకారం కూడా చేయిస్తారు.
అందరూ ఓటేయాలి: రాణి కుముదిని
ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన వ్యక్తులను ఓటు ద్వారా ఎన్నుకునేందుకు చట్టం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాణి కుముదిని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు పార్టీ గుర్తుల ప్రాతిపదికన బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయని చెప్పారు. అన్ని పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాలలో కూడా రికార్డింగ్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. 8,203 కేంద్రాల్లో, 16,031 బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 137 స్ర్టాంగ్ రూమ్‌లను, 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఎన్నికల విధుల్లో దాదాపు 45 వేలమంది పాల్గొంటారని ఆమె తెలిపారు.
కోడ్ అమల్లోకి: మహేశ్ భగవత్
రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందని లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ ఎన్నికల విధుల్లో 22 వేల మంది పోలీసులు పాల్గొంటారని చెప్పారు. 1926 సున్నితమైన, 1300, అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని తెలిపారు. మతపరంగా సున్నితమైన పోలింగ్ కేంద్రాలు నిర్మల్, బైంసా, బోధన్, నిజామాబాద్‌లలో ఉన్నట్లు చెప్పారు.