తెలంగాణలో మోగిన మునిసి పోల్స్ నగారా!
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:28 AM
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది.
హైదరాబాద్, జనవరి 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బుధవారమే కమిషనర్లు నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. 30వ తేదీ వరకు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 3 మధ్యాహ్నం మూడు గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఏడు కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలను వెల్లడిస్తారు.