Share News

మనమే గెలవాలి.. మన జెండానే ఎగరాలి!

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:16 AM

పుర పోరుకు ఎన్నికల సంఘం నగారా మోగించిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు యుద్ధానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యాయి.

మనమే గెలవాలి.. మన జెండానే ఎగరాలి!

  • మునిసిపల్‌ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధం

  • మంత్రులకు లోక్‌సభ స్థానాలవారీగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్‌ పార్టీ

  • అభ్యర్థుల ఎంపిక బాధ్యతా వారిపైనే

  • 3 నుంచి సీఎం రేవంత్‌ ప్రచారం!

  • పట్టణాలపైనా పట్టు కోసం పట్టుదల

  • స్థానిక సమస్యలపైనే బీఆర్‌ఎస్‌ ఫోకస్‌

  • అభ్యర్థుల ఎంపికా స్థానిక నాయకత్వానికే!

  • ప్రభుత్వ వ్యతిరేకతే గెలిపిస్తుందని ధీమా

  • పట్టణ ప్రాంత ఓటింగ్‌పై బీజేపీ ఆశలు

హైదరాబాద్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): పుర పోరుకు ఎన్నికల సంఘం నగారా మోగించిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు యుద్ధానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుకుని ప్రచారం వరకూ కార్యాచరణను సిద్ధం చేసుకుని, అమలు కూడా మొదలుపెట్టాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గుర్తుపై జరుగుతున్న తొలి ఎన్నికలు.. పట్టణ ప్రాంతాల్లో పార్టీల బలాబలాలను ప్రత్యక్షంగా తెలిపే ఎన్నికలు.. ఇవే కావడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు సీరియ్‌సగా తీసుకున్నాయి. ఎన్నికల యుద్ధంలో గెలిచి పురపాలికలపై తమ జెండా ఎగరేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. మెజారిటీ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో గెలుపు తమదేనన్న ధీమాను మూడు పార్టీలూ వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ సీట్లను దక్కించుకున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ.. అదే హవాను మునిసిపల్‌ ఎన్నికల్లోనూ కొనసాగించి, పట్టణ ప్రాంతాల్లోనూ పట్టు సాధించాలనే పట్టుదలతో కసరత్తు చేసింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ ఎన్నికలను మరింత ప్రతిష్ఠాత్మకంగా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై పట్టు దొరికితే విజన్‌ 2047ను సమర్థంగా అమలు చేసే స్వేచ్ఛ సీఎం రేవంత్‌కు, ప్రభుత్వానికి లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలను సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు వెల్లడిస్తున్నాయి.


రెబల్‌ అభ్యర్థులకు చెక్‌

పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ సీట్లను దక్కించుకున్నా.. రెబల్‌ అభ్యర్థుల కారణంగా అనేక పంచాయతీలను కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకోలేక పోయింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థులకు చెక్‌ పెట్టాలని సీఎం రేవంత్‌ నిర్ణయించారు. మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి లోక్‌సభ నియోజకవర్గాలవారీగా మంత్రులకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కంటెస్టెడ్‌ క్యాండిడేట్లు, నాయకులను సమన్వయం చేసుకుని పని చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పార్టీని గెలిపించే బాధ్యతను వారిపై పెట్టారు. ఆ పరిధిలోని మునిసిపల్‌ వార్డులు, కార్పొరేషన్ల డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతనూ వారికే అప్పగించారు. ఆ మంత్రులు చైర్మన్లుగా, స్థానిక డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సభ్యులుగా స్ర్కీనింగ్‌ కమిటీలను.. టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుని డివిజన్‌/వార్డుకు ఆరుగురు చొప్పున ఆశావహులను ఎంపిక చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపుతాయి. గెలుపు, సామాజిక సమతుల్యత ఆధారంగా రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేసి బీ ఫారం ఇవ్వనుంది. ఈ ప్రక్రియలో అసంతృప్తులను బుజ్జగించి రెబల్‌గా బరిలోకి దిగకుండా చూసే బాధ్యతనూ స్ర్కీనింగ్‌ కమిటీనే చూసుకోనుంది. అలాగే ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు మొదలుకుని ప్రచారం, పోలింగ్‌ దాకా ఇంచార్జి మంత్రులే సమన్వయం చేసుకోనున్నారు. కాగా.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌కు తిరిగిరాగానే మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి సుడిగాలి ప్రచారం చేపట్టనున్నారు. జీ రామ్‌ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం రేవంత్‌రెడ్డి సభలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఈ సభలనే ఆయన మునిసిపల్‌ ఎన్నికల సభలుగా మలుచుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


స్థానిక సమస్యలపైనే..

ప్రభుత్వ వ్యతిరేకతే మునిసిపల్‌ ఎన్నికల్లో తమను గెలిపిస్తుందంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఈ ఎన్నికల్లో స్థానిక సమస్యలే ఎజెండాగా పనిచేస్తోంది. అలాగే.. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, గెలిపించే బాధ్యతను పూర్తిగా స్థానిక నాయకత్వానికే వదిలేస్తున్నట్లు ఇటీవల చిట్‌చాట్‌లో కేటీఆర్‌ వెల్లడించారు. ఇందులో రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ గానీ, తాను గానీ ప్రచారం చేయాల్సిన అవసరమూ లేదన్నారు. ప్రతి మునిసిపాలిటీకీ ఒక ఇంచార్జిని, ప్రతి జిల్లాకు ఒక సమన్వయ కర్తను నియమించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం.. ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీని గెలిపించే బాధ్యతను వారికే అప్పగించింది. మెజారిటీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామన్న ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే తమకు ఎక్కువగా బలముందని, తమకు సైలెంట్‌ ఓటింగ్‌ జరుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. వారు పట్టణ ప్రాంత ఓటింగ్‌పై బలంగా నమ్మకం పెట్టుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఇప్పటికే ఇంచార్జిలను నియమించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు వారితో మూడు సార్లు సమీక్ష సమావేశాలూ నిర్వహించారు. స్మార్ట్‌ సిటీలు మొదలు.. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలూ ఓటర్లకు చెబుతున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

Updated Date - Jan 28 , 2026 | 04:16 AM