మున్సిపల్ ఫలితాలపై అధిష్ఠానం హ్యాపీ
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:44 AM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాల పట్ల పార్టీ అధిష్ఠానం సంతోషం వ్యక్తం చేసిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు.
15 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు నాకు ఫోన్ చేసి అభినందించారు
ఈ నెల 21 నుంచి పది రోజులు తెలంగాణ, ఏపీ డీసీసీ చీఫ్‌లకు శిక్షణ
ఒక రోజు ఖర్గే, రాహుల్ వచ్చే చాన్స్
టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాల పట్ల పార్టీ అధిష్ఠానం సంతోషం వ్యక్తం చేసిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. 15 రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు తనకు ఫోన్ చేసి అభినందించారని తెలిపారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని మహేశ్‌గౌడ్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేటీఆర్ పరిస్థితి మరింత దిగజారిందని వ్యాఖ్యానించారు. రాజ్యసభకు చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఒక సీటు బీసీకి కేటాయించాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని చెప్పారు. ఢిల్లీలో గురువారం అధిష్ఠానం వద్ద జరిగే సమావేశంలో పార్టీ నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చ ఉంటుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు సర్వేల ఆధారంగానే టికెట్లు ఇచ్చామని, ఈ విషయంలో సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఆలోచన చేయాలని సూచించారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గతంలో చేసిన అరాచకాలు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21 నుంచి పది రోజులపాటు వికారాబాద్ హరిత ప్లాజాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని.. అందులో ఒక రోజు సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పదో తరగతి పరీక్షల తర్వాతే నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. జీహెచ్‌ఎంసీపైనా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. కాగా, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చేర్యాల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఓటమిపై సమీక్షించనున్నట్టు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అక్కడి నాయకులు కొందరు కోవర్టులుగా మారారని ఆరోపించారు. ఇక ముస్లింలను బీసీ రిజర్వేషన్ జాబితాలో ఎలా చేరుస్తారంటూ ప్రశ్నించిన బీజేపీ.. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీసీలకు కేటాయించిన వార్డులో ముస్లిం వ్యక్తికి ఎలా టికెట్టు ఇచ్చిందని ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ప్రశ్నించారు.గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎవరూ బీఆర్‌ఎ్‌సను ఆదరించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు.