Share News

ఒక్కో ఓటుకు రూ.70 వేలు!

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:54 AM

మునిసిపల్‌ ఎన్నికల పుణ్యమాని మొయినాబాద్‌ మునిసిపాలిటీలో ఓ వార్డు ఓటర్లపై కాసుల వర్షం కురిసినట్టు తెలిసింది.

ఒక్కో ఓటుకు రూ.70 వేలు!

  • పట్టుచీర, బియ్యం బస్తా, నిత్యావసరాలు

  • మొయినాబాద్‌లోని ఓ వార్డు ఓటర్లపై కాసుల వర్షం

  • కౌన్సిలర్‌ పదవి కోసం దాదాపు ఏడు కోట్లు ఖర్చు పెట్టిన ఓ అభ్యర్థి

  • ఓటుకు రూ.40 వేలు పంచిన ప్రత్యర్థి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల పుణ్యమాని మొయినాబాద్‌ మునిసిపాలిటీలో ఓ వార్డు ఓటర్లపై కాసుల వర్షం కురిసినట్టు తెలిసింది. ఆ వార్డులో ఒక్కో ఓటుకు రూ.40వేల నుంచి రూ.లక్ష దాకా నగదు పంపిణీ జరిగినట్టు సమాచారం. అంతేనా, ఆ వార్డు కౌన్సిలర్‌ పదవి కోసం పోటీ చేసిన ఓ అభ్యర్థి ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేశారనే విషయం చర్చనీయాంశమైంది. మొయినాబాద్‌ మునిసిపాలిటీలోని ఒక వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఓ వ్యక్తి ఒక్కో ఓటుకు రూ.70 వేలు చొప్పున నగదు పంపిణీ చేశారని అంటున్నారు. అంతేనా.. ఈ నగదుతోపాటు పట్టుచీర, 25 కిలోల బియ్యం, 15లీటర్ల నూనెడబ్బా, నెలకు సరిపడా పప్పులు కూడా పంపిణీ చేశారని తెలిసింది. ప్రత్యర్థి పార్టీ శ్రేణులకు మినహా మిగిలిన వారందరికీ ఆయన ఈ నగదు, సరుకులు పంపిణీ చేసినట్టు చెబుతున్నారు. ఇక, అదే వార్డులో ఓ జాతీయ పార్టీ నుంచి బరిలోకి దిగిన మరో అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.40వేల వరకు పంపిణీ చేశారని స్ధానికులు పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది ఓటర్లకు ఓటుకు రూ.లక్ష అందినట్టు చెబుతున్నారు. మొయినాబాద్‌ మునిసిపాలిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ ప్రభావం అధికంగా ఉంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన వారు విజయం కోసం ఎంత ఖర్చు అయినా వెనక్కి తగ్గలేదని స్థానికులు చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్ధి ఓటర్లకు పంచడానికే దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేయగా, పదిహేను రోజుల ప్రచారానికి మరో రెండు కోట్లు వరకు ఖర్చు పెట్టారని రాజకీయవర్గాల సమాచారం. కౌన్సిలర్‌ పదవి కోసం ఈస్థాయి ఖర్చు తెలంగాణలోనే అత్యధికమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరువర్గాల నుంచి భారీగా డబ్బు అందినా, ఓటుకు రూ.70 వేలు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థే గెలుస్తారని స్థానికులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Feb 13 , 2026 | 04:54 AM