నేడే కౌంటింగ్
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:52 AM
తెలంగాణ పుర పోరు చివరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియ శుక్రవారం చేపట్టనున్నారు..
తేలనున్న ‘మునిసిపల్’ అభ్యర్థుల భవితవ్యం
రాష్ట్రవ్యాప్తంగా 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలు.. 12 వేల మంది పోలీసులతో భద్రత
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు.. ధిక్కరిస్తే కఠిన చర్యలు: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ పుర పోరు చివరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియ శుక్రవారం చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తం 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసి, ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యానాయక్ తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత సాధారణ బ్యాలెట్ల లెక్కింపు చేపడతామన్నారు. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుళ్ల వద్దకు తెచ్చి.. వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కట్టి.. డ్రమ్‌లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్‌లో 1,000 బ్యాలెట్ పత్రాలను (40 బండిల్స్‌ను) ఒక్కో టేబుల్‌కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటుచేసిన చెక్క ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా, చెల్లని ఓట్లను నమోదు చేసి అభ్యర్థుల తరఫు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఇదే పద్ధతిలో ప్రతి వార్డు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. రాష్ట్రంలో 116 మునిసిపాలిటీల్లోని 2,582 వార్డులకు 12 ఏకగ్రీవం కాగా, ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. 2,569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించగా 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లకు 2 ఏకగ్రీవం కాగా.. 412 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 2,225 మంది అభ్యర్థులు తలపడ్డారు.
కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ
రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు 12 వేల మంది పోలీసులను మోహరించామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సాయుధ పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ బృందాలు నిరంతరం పహారా కాస్తాయని, అదనపు భద్రత కోసం ప్రతి కేంద్రాన్నీ సీసీటీవీ నిఘాలో ఉంచామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే మార్గాలను నియంత్రిస్తున్నామని, పాస్‌లు ఉన్న వారినే కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అల్లర్లు, అలజడులకు ఆస్కారం లేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఎన్‌ఎన్‌ఎ్‌స సెక్షన్ 163, ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వాటికి 200మీటర్ల దూరంలో ఎవరూ గుమికూడరాని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని డీజీపీ కోరారు.