అసెంబ్లీ పోరును తలపించేలా..
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:19 AM
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచారాన్ని చేపట్టాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు మొదలుపెట్టగా..
మునిసిపల్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రచార జోరు
జాతీయ నేతలతో బీజేపీ ప్రచారం
మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం!
ఉమ్మడి పాలమూరు, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌పై ఫోకస్
ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవాలనిబీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ ఆదేశం
కేటీఆర్, హరీశ్‌లపై ప్రచార భారం!
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచారాన్ని చేపట్టాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు మొదలుపెట్టగా.. బీజేపీ జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల ప్రచారం, గెలిపించుకునే బాధ్యతను దాదాపుగా స్థానిక నాయకత్వానికే వదిలేసింది. కేసీఆర్ ప్రచారానికి మొత్తంగా దూరంగా ఉన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు కూడా పెద్దగా ప్రచారం చేయడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీఎం రేవంత్ సుడిగాలి పర్యటన!
పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో మున్నిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న 9 ఉమ్మడి జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఆ సభలే వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించిన ఆయన.. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో, 6న నిజామాబాద్ రూరల్, 7న ఉమ్మడి రంగారెడ్డిలోని పరిగిలో, 8న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, ప్రచారమూ నిర్వహించనున్నారు. ప్రచారానికి చివరి రోజైన 9వ తేదీన మెదక్ జిల్లాలో కార్యక్రమం పెట్టుకున్నారు. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న మంత్రులు.. వాటి పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వారికితోడుగా స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులూ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.
జాతీయ నేతలతో బీజేపీ ముందుకు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా నిలిచేందుకు మున్సిపల్ ఎన్నికలతో మార్గం వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. విజయ సంకల్ప సమ్మేళనం పేరుతో బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో ఎన్నికల ప్రచారం చేపట్టింది. ఈ నెల 9న నిర్మల్‌లో జరిగే సభలో కేంద్ర మంత్రి అమిత్‌షా పాల్గొంటున్నారు. మరోవైపు యువతను ఆకట్టుకునేందుకు ఎన్డీయే భాగస్వామి జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌నూ రంగంలోకి దింపుతోంది. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవాలన్న కేసీఆర్
పార్టీల గుర్తులపై జరిగే మున్సిపల్ ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలను అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. కానీ ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీనితో బీఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలు కేటీఆర్, హరీశ్‌రావులపైనే పడ్డాయి. అయితే వారు కూడా ఇప్పటివరకు తమ సొంత నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలపైనే దృష్టిపెట్టారు. ప్రచార వేడి ఉధృతం కావడంతో ఇతర మున్సిపాలిటీల్లో ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ తిరిగి నిలదొక్కుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపకతప్పని పరిస్థితిలో క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు.