Share News

నేటితో ప్రచారం బంద్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:25 AM

రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. సాయంత్రం ఐదు గంటల కల్లా మైకులు మూగబోనుండగా, ప్రచార రథాలు విశ్రాంతి తీసుకోనున్నాయి.

నేటితో ప్రచారం బంద్‌

హైదరాబాద్‌, పిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. సాయంత్రం ఐదు గంటల కల్లా మైకులు మూగబోనుండగా, ప్రచార రథాలు విశ్రాంతి తీసుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా.. ఏడు కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మునిసిపాలిటీల్లోని 2,582 వార్డులు కలిపి మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలో 121 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉండగా వాటిల్లో 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్‌ఎంసీ, గ్రేటర్‌వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు మినహా కరీంనగర్‌, రామగుండం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ కార్పొరేషన్లలో ఎన్నికలు చేపడుతున్నారు. 121 మునిసిపాలిటీల్లోని నకిరేకల్‌, సిద్ధిపేట, కొత్తూరు., జడ్చర్ల, అచ్చంపేట పురపాలికలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 116 మునిసిపాలిటీలకు సంబంధించిన వార్డుస్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి, అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు 16,031 బ్యాలెట్‌ బాక్సులను సిద్థం చేయడంతోపాటు 8,203 పోలింగ్‌ కేంద్రాలను నిర్ణయించారు. ఎన్నికల సామగ్రి భద్రత కోసం 137 స్ర్టాంగ్‌ రూమ్‌లను, ఓట్ల లెక్కింపునకు 136 కౌంటింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 02:26 AM