Share News

కరీంనగర్‌పై కాంగ్రెస్‌ కన్ను!

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:28 AM

రాష్ట్రంలోని కార్పొరేషన్లలో ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థి మేయర్‌ పీఠాలను అధిష్టించనున్నారో.. డిప్యూటీ మేయర్‌ పీఠాలు ఎవరికి దక్కనున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

కరీంనగర్‌పై కాంగ్రెస్‌ కన్ను!

శరవేగంగా మారుతున్న సమీకరణాలు .. విప్‌ జారీ చేసిన ఫార్వర్డ్‌బ్లాక్‌.. కాంగ్రె్‌సకే మద్దతిచ్చే అవకాశం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలోని కార్పొరేషన్లలో ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థి మేయర్‌ పీఠాలను అధిష్టించనున్నారో.. డిప్యూటీ మేయర్‌ పీఠాలు ఎవరికి దక్కనున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏ కార్పొరేషన్‌లో పరిస్థితి ఎలా ఉందో చూస్తే.. కరీంనగర్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ కార్పొరేషన్‌లో అత్యధిక స్థానాలు సాధించుకున్న బీజేపీ ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఫార్వర్డ్‌బ్లాక్‌ సభ్యురాలి మద్దతుతో అధికారాన్ని చేపట్టడం ఖాయమని భావిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్‌ నేతలు దానిని అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ 66 డివిజన్లు ఉండగా.. బీజేపీ 30, కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, ఎంఐఎం 3, ఫార్వర్డ్‌బ్లాక్‌ 2డివిజన్లు దక్కించుకున్నాయి. ఇండిపెండెంట్లు 8 మంది విజయం సాధించారు. ఈ కార్పొరేషన్‌లో ఎంపీ బండి సంజయ్‌, కరీంనగర్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, కవ్వంపల్లి సత్యనారాయణ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అంటే.. ఇక్కడ అధికారం దక్కించుకోవడానికి 35 మంది బలం అవసరమవుతుంది. బీజేపీకి 30మంది కార్పొరేటర్లు, బండి సంజయ్‌కుమార్‌ ఎక్స్‌ అఫీషియో ఓటు కూడా ఉంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత ముగ్గురు ఇండిపెండెంట్లు (మాసం గణేశ్‌, వేముల కవిత, తేళ్ల లక్ష్మి), ఫార్వర్డ్‌బ్లాక్‌ సభ్యురాలు సాయిజ్యోతి తమ పార్టీలో చేరారని ఆ పార్టీ ప్రకటించింది. దీంతో బీజేపీ బలం 35కు పెరిగి మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకున్నట్టయింది. అయితే, అధిష్ఠానం ఆదేశాల మేరకు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఇతర ముఖ్యనేతలు..ఎంఐఎం, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టేందుకు, కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఐదుగురు ఇండిపెండెంటు సభ్యులనూ తమ క్యాంపులో చేర్చుకున్నారు. ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లలో ఒకరు కాంగ్రె్‌సకు, ఇంకొకరు బీజేపీకి మద్దతు తెలుపగా.. ఆ పార్టీతో విప్‌ జారీ చేయించారు. 16న జరిగే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సమావేశానికి హాజరుకావాలని విప్‌ జారీ చేసి, గెలిచిన తమ ఇద్దరు అభ్యర్థుల ఇళ్లకు నోటీసులను అంటించారు. ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నామో తెలుపుతూ సమావేశానికి ముందే విప్‌ జారీ చేస్తామని కూడా పేర్కొన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ మతరాజకీయాలను రెచ్చగొడుతోందని, ఆ పార్టీకి తాము మద్దతు ఇచ్చే అవకాశం లేదని వెల్లడించారు. దీనితో ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్‌ కూటమికేనని తేలిపోయింది. ఫార్వర్డ్‌బ్లాక్‌ విప్‌ నోటీసులు ఇళ్లకు అంటించగానే ఆ పార్టీ కార్పొరేటర్‌ సాయిజ్యోతి కాంగ్రెస్‌ క్యాంపునకు వెళ్లిపోయారని సమాచారం. దీంతో కాంగ్రెస్‌ కూటమి బలం 35కు చేరింది. బీజేపీ బలం 34కి పరిమితమైంది.


నిజామాబాద్‌లో కాంగ్రెస్‌, ఎంఐఎం కలిసి

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. ఇక్కడ అధికారం దక్కించుకోవడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 31 కాగా.. బీజేపీకి 28, కాంగ్రె్‌సకు 17, ఎంఐఎంకు 14, బీఆర్‌ఎ్‌సకు 1 వచ్చాయి. వీరిలో.. ఉన్న ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థీ కాంగ్రె్‌సలో చేరారు. దీంతో కాంగ్రెస్‌, ఎంఐఎంలు కలిసి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకోవడం లాంఛనప్రాయం కానుంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్‌గా.. మజ్లి్‌సకు చెందిన సల్మాతైసిన్‌ ఖరారు అయినట్లు సమాచారం.

కొత్తగూడెం.. చెరి సగం!

రాష్ట్రంలోనే హాట్‌ టాపిక్‌గా మారిన కొత్తగూడెం మేయర్‌ పీఠంపై చెరో రెండున్నరేళ్లూ కూర్చోవాలని సీపీఐ, కాంగ్రెస్‌ ఒక నిర్ణయానికి వచ్చాయి. తొలి రెండున్నరేళ్లూ ఆ పీఠాన్ని అధిష్ఠించే అవకాశం సీపీఐ నేతకే దక్కనుంది. ఇక్కడ మొత్తం 60 డివిజన్లు ఉండగా.. సీపీఐ, కాంగ్రెస్‌ అభ్యర్థులు చెరో 22 డివిజన్‌లలో గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 8 మంది, స్వతంత్రులు ఆరుగురు, బీజేపీ, సీపీఎం అభ్యర్థులు ఒక్కోడివిజన్‌లో గెలిచారు. ఇండిపెండెంట్లలో ఐదుగురు.. ఆదివారం ఖమ్మంలో మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఇక్కడ మేయర్‌ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యింది. కార్పొరేషన్‌లో మొత్తం ఎస్టీ స్థానాలు 11 కాగా.. సీపీఐ తరపున ముగ్గురు అభ్యర్థులు.. మూడ్‌ గణేష్‌, సునావత్‌ శ్యామల, బాణోత్‌ కళావతి గెలుపొందారు. వీరిలో మేయర్‌ పీఠానికి.. మూడ్‌ గణేష్‌ పేరును సీపీఐ ఖరారు చేసినట్టు తెలిసింది. కాగా.. కొత్తగూడెం కార్పొరేషన్‌ ఏర్పడిన తర్వాత తొలి మేయర్‌గా సీపీఐ పార్టీ అభ్యర్థి పీఠంపై కూర్చోవడం విశేషం.


పాలమూరులో మేయర్‌కు లైన్‌ క్లియర్‌..

పాలమూరు కార్పొరేషన్‌ అయిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరగ్గా.. 60 వార్డులకుగాను కాంగ్రెస్‌ 29 చోట్ల గెలిచింది. బీఆర్‌ఎస్‌ 15, బీజేపీ 8, ఏఐఎంఐఎం 3 చోట్ల విజయం సాధించగా.. స్వతంత్రులు అయిదు స్థానాల్లో గెలుపొందారు. ఇండిపెండెంట్లలో నలుగురు ఇప్పటికే కాంగ్రె్‌సలో చేరిపోయారు. ఎంఐఎం నుంచి గెలిచిన ముగ్గురు కూడా కాంగ్రె్‌సకే మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే ఓటుతో కలుపుకొని మొత్తం కాంగ్రెస్‌ బలం 37కు చేరింది. ఇక్కడ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి మేయర్‌ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపించాయి.వారిలో ఒకరు మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌ సతీమణి ప్రసన్న కాగా.. మిగతా ఇద్దరు సీనియర్‌ నాయకుడు ఎన్‌పీ వెంకటేష్‌ కూతురు నేహశ్రీ, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌ సతీమణి స్వప్న. నేహశ్రీ, స్వప్న ఇద్దరూ ఎన్నికల్లో ఓటమి చెందారు. దీంతో తొలి మేయర్‌ పీఠం ప్రసన్న ఆనంద్‌గౌడ్‌ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నల్లగొండలో లాంఛనప్రాయంగా..

నల్లగొండ కార్పొరేషన్‌ మేయర్‌గా బుర్రి చైతన్యరెడ్డి ఎన్నిక లాంఛనప్రాయమే. ఈమె భర్త శ్రీనివా్‌సరెడ్డి మంత్రికి ప్రధాన అనుచరుడు కావడంతో ఎన్నికలకు ముందే ఈమెను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ.. 48 డివిజన్లకుగాను 27 చోట్ల కాంగ్రెస్‌ గెలుపొందగా, 9చోట్ల బీఆర్‌ఎస్‌, 4 డివిజన్లలో బీజేపీ, 4 డివిజన్లలో ఫార్వర్డ్‌బ్లాక్‌, 2 డివిజన్లలో ఎంఐఎం గెలిచాయి. 2 డివిజన్లలో స్వతంత్ర అభ్యర్ధులు గెలుపొందారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ కార్పొరేటర్లు ఇద్దరూ కాంగ్రెస్‌ గూటికి చేరడంతో ఆ పార్టీ బలం 29కి చేరింది. ఇక్కడ డిప్యూటీ మేయర్‌గా మైనారిటీ వర్గానికి చెందిన ఇబ్రహీం, మహబూబ్‌అలీతో పాటు బీసీవర్గాలకు చెందిన మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి, అబ్బగోని కవితాగౌడ్‌ పోటీపడుతుండగా, అధినాయకత్వం ఎవరికి అవకాశం కల్పిస్తుందనే అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Updated Date - Feb 16 , 2026 | 02:28 AM