ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోల్‌మాల్
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:14 AM
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ)లో ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలు వ్యవహరంలో ఏకంగా రూ.30 కోట్లకు పైగా సొమ్ము కొల్లగొట్టేందుకు పథకం సిద్ధమైందా.....
30 కోట్లకు పైగా సొమ్ముకు ఎసరు? .. 11 యంత్రాల కొనుగోలుకు సర్కారు నిర్ణయం
ఆ బాధ్యతలు టీజీఎంఎ్‌సఐడీసీకి అప్పగించిన వైద్యశాఖ
మార్కెట్ రేటు కన్నా అధిక ధరలను కోట్‌చేసిన కంపెనీలు
టీజీఎంఎ్‌సఐడీసీలో ఓ అధికారి చక్రం తిప్పడమే కారణం
హెల్త్ సెక్రటరీ ఇంట్రెస్టు అంటూ ఆమోదింపజేసే యత్నం?
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ)లో ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలు వ్యవహరంలో ఏకంగా రూ.30 కోట్లకు పైగా సొమ్ము కొల్లగొట్టేందుకు పథకం సిద్ధమైందా? ఈ వ్యవహారంలో ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు కొందరు యత్నిస్తున్నారా? అంటే.. ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రులతో పాటు హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆస్పత్రుల్లో ఆధునాతన యంత్రపరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. పదకొండు మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్(ఎంఆర్‌ఐ) యంత్రాలను కొనుగోలు చేయాలని అధికారులు భావించారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐదు ‘3టి ఎంఆర్‌ఐ’ యంత్రాలు, రెండు ‘70 బోర్’ మోడల్ యంత్రాలు, నాలుగు ‘60 బోర్’ మోడల్ యంత్రాలు కొనాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను వైద్యశాఖ టీజీఎంఎ్‌సఐడీసీకి అప్పగించింది. ఈ మేరకు కార్పొరేషన్.. నిరుడు ఈ 11 మిషన్ల కొనుగోలుకు టెండర్లను పిలిచింది. ఈ యంత్రాలను నాలుగైదు కంపెనీలు మాత్రమే సరఫరా చేస్తుండగా.. వాటిలో ఒకే ఒక కంపెనీ మాత్రమే సరఫరా చేయడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సింగిల్ టెండర్ వస్తే దాన్ని రద్దు చేస్తారు. అలా రద్దు చేసి మరోసారి పిలిచినా అదే పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత మరోమారు టెండరు పిలవగా.. తొలుత కోట్ చేసిన కంపెనీ టెండరులో పాల్గొనలేదు. మరో కంపెనీ ముందుకొచ్చింది. అదీ సింగిల్ టెండరే కావడంతో.. టెండర్లను ఖరారు చేసే కమిటీ చైర్మన్ (వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్) మరోమారు రిజెక్టు చేశారు. ఇలా ఐదుసార్లు జరిగింది. మొదటి రెండుసార్లు ఒక కంపెనీ రాగా.. మిగతా మూడుసార్లూ మరో కంపెనీ టెండర్ వేసింది. ఆ కంపెనీ కోట్ చేసిన రేట్లు చూసి ఉన్నతాఽధికారులు అవాక్కయ్యారు.
అడ్డగోలు రేట్లు...
విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘‘3టి ఎంఆర్‌ఐ’ యంత్రం ఒక్కొదానికీ ఆ కంపెనీ రూ.22 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. మార్కెట్లో దీని ధర రూ.18 కోట్ల దాకా ఉంటుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. అంటే ఒక్కో యంత్రానికీఅదనంగా రూ.4 కోట్లు కోట్ చేశారు. ఇలా ఐదు యంత్రాలకూ కలిపి రూ.20 కోట్లు అదనంగా కోట్ చేసినట్టు. ఇక ‘‘70 బోర్’’ మోడల్ ఎంఆర్‌ఐ మిషన్‌కు రూ.18 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం ఇదే ప్రత్యేకతలున్న ఎంఆర్‌ఐ యంత్రాన్ని గాంధీ ఆస్పత్రి కోసం కొన్నారు. అప్పుడు దాని ధర రూ.13.8 కోట్లు. అంటే ఒక్కో మిషన్‌కూ అదనంగా రూ.4.2 కోట్లు కోట్ చేశారు. రెండు యంత్రాలకూ కలిపి అదనంగా రూ.8.4 కోట్లు కోట్ చేశారు. ఇక ‘‘60 బోర్’’ మోడల్ మిషన్‌కు రూ.12.5 కోట్లు కోట్ చేశారు. ఇదే యంత్రాన్ని రెండేళ్ల క్రితం ఆదిలాబాద్ రిమ్స్ కోసం కొనుగోలు చేయగా.. అప్పట్లో దాని ధర రూ.11.5 కోట్లు. ఆ మోడల్ యంత్రాలు నాలుగింటికీ కలిపి అదనంగా రూ.4 కోట్లు కోట్ చేసినట్టు. 11 యంత్రాలకూ కలిపి మొత్తంగా రూ.30 కోట్లకు పైగా అదనంగా కోట్ చేశారు. ఆస్పత్రుల్లో యంత్రాల కొనుగోలుకు సంబంధించి కమిషనర్ ఆధ్వర్యంలో బిడ్ ఫైనాన్స్ కమిటీ (బీఎ్‌ఫసీ) ఉంటుంది. ధరతో పాటు ఇతర విషయాలన్ని కూడా బీఎ్‌ఫసీనే ఖరారు చేస్తుంది. టెండరు వేసిన కంపెనీ.. ఎంఆర్‌ఐ యంత్రాలకు అడ్డగోలు ధరలు కోట్ చేయడాన్ని ఆ కమిటీ గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో వీటి ధర ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతానికి.. ‘60 బోర్’ మోడల్ ఎంఆర్‌ఐ మిషన్ కొనుగోలుకు బీఎ్‌ఫసీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఎందుకంటే ధర విషయంలో గతంలో సరఫరా చేసిన యంత్రానికి దీనికి మధ్య కోటి రూపాయలే తేడా ఉండటం వల్ల ఆమోదించినట్లు తెలుస్తోంది. మిగతా వాటి విషయంలో ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటంతో ప్రస్తుతానికి వాటి కొనుగోలును పక్కనపెట్టినట్లు సమాచారం.
అడిషనల్ డీఎంఈ స్థాయి అధికారి ఎక్కడ?
వాస్తవానికి కార్పొరేషన్ కొనుగోలు చేసే మెజారిటీ యంత్రాలు, డ్రగ్స్, సర్జికల్స్ అన్నీ కూడా వైద్యవిద్య డైరెక్టర్ పరిధిలోకే వస్తాయి. అందుకోసం ఉమ్మడి రాష్ట్రంలో ఔషధ కార్పొరేషన్‌లో ఒక అదనపు డీఎంఈ స్థాయి అధికారిని నియమించారని.. కానీ తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి నేటి దాకా ఔషధ కార్పొరేషన్‌లో అడిషనల్ డీఎంఈను నియమించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.
ఔషధ కార్పొరేషన్‌లో ఆ ఇద్దరూ కలసి...
కిందటి సంవత్సరం జనవరిలో తమిళనాడు మెడికల్ కార్పొరేషన్.. ‘‘1.5 టెస్లా’’ ఎంఆర్‌ఐ యంత్రాన్ని కేవలం రూ.6.3 కోట్లకే కొనుగోలు చేసింది. ఆ వివరాలు అక్కడి కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోళ్లలో పదేపదే సింగిల్ టెండర్ రావడం వెనుక.. వచ్చిన కంపెనీలు అత్యధిక రేట్లు కోట్ చేయడం వెనుక ఔషధ కార్పొరేషన్‌లోని ఇద్దరు కీలక అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా.. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ఓ కీలక అధికారి కుటుంబ సభ్యుడొకరు తన పరపతిని ఉపయోగించి నాలుగేళ్ల క్రితం కార్పొరేషన్‌లో ఒక కీలక పోస్టులో చేరారు. నాటి నుంచి నేటి వరకు సదరు అధికారి కార్పొరేషన్‌లో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఔషధ కార్పొరేషన్‌లో పనిచేసి, అక్కడ అక్రమాలకు పాల్పడి, విజిలెన్స్ కేసులు ఎదుర్కొన్న మరో అధికారి.. నిరుడు ఈ కార్పొరేషన్‌కు వచ్చారు. వారిద్దరూ కలిసి ఈ రేట్ల పెంపు తతంగం నడిపినట్లు ఆరోపణలున్నాయి. అలాగే బీఎ్‌ఫసీ సమావేశం జరిగినప్పుడు సాధారణంగా.. ముందుగానే ఏజెండా పంపుతారు. ఆ ఏజెండాలో డ్రగ్స్, సర్జికల్స్, ఎక్వి్‌పమెంట్ కొనుగోళ్ల వివరాలుంటాయి. అయితే నాలుగేళ్ల క్రితం కార్పొరేషన్‌లో చేరిన అధికారి.. బీఎ్‌ఫసీ ఏజెండాలో ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోళ్ల విషయాన్ని ప్రస్తావించలేదని, మీటింగ్ జరిగే సమయానికి హడావుడిగా ఎంఆర్‌ఐ కొనుగోళ్ల ఫైలును తీసుకెళ్లారని తెలిసింది. ఏజెండాలో లేని అంశాన్ని ఎందుకింత అర్జెంట్‌గా తీసుకొచ్చారని ఉన్నతాఽధికారులు ప్రశ్నించగా.. హెల్త్ సెక్రటరీ పర్సనల్ ఇంట్రెస్టుతో చెప్పారని, అందుకే అర్జంట్‌గా తీసుకువచ్చామని, వెంటనే ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలుకు ఆమోద ముద్ర వేయాలని సదరు అధికారి హడావుడి చేసినట్లు ఒకరిద్దరు విభాగాధిపతులు వెల్లడించారు.