Share News

తెలంగాణకు ఇచ్చిన హామీలపైనా బిల్లు పెట్టండి

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:03 AM

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం తెచ్చిన బిల్లును స్వాగతిస్తున్నామని, అదే సమయంలో విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బిల్లు తీసుకురావాలని ఎంపీ మల్లు రవి డిమాండ్‌ చేశారు.

తెలంగాణకు ఇచ్చిన హామీలపైనా బిల్లు పెట్టండి

  • కిషన్‌రెడ్డి, సంజయ్‌ చొరవ చూపాలి: మల్లు రవి

  • రైల్వే కేటాయింపుల్లోనూ వివక్ష : ఎంపీ వంశీకృష్ణ

  • తెలంగాణపై చిన్నచూపెందుకు?: రఘురాం రెడ్డి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం తెచ్చిన బిల్లును స్వాగతిస్తున్నామని, అదే సమయంలో విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బిల్లు తీసుకురావాలని ఎంపీ మల్లు రవి డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో ఏపీ పునర్విభజన బిల్లు-2026పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఐఐఎం, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు, ఒక ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. ఈ విషయమై లోక్‌సభలో బిల్లు పెట్టేలా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తులు అందించలేదని కిషన్‌రెడ్డి చెప్పడం బాధాకరమని, సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ఎంపీలు అనేక మార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడిని కలిశామని గుర్తు చేశారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ రైల్వే కేటాయింపుల్లోనూ తెలంగాణపై కేంద్ర ప్రభు త్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు. భద్రాచలం, కొత్తగూడెంలో ముంపు జలాలతో 2 లక్షల మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని, తక్షణమే కరకట్ట నిర్మించాలని కోరారు. ఏపీకి అధిక నిధులు ఇస్తున్నందుకు తమకేమీ బాధ లేదని, తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నారన్నదే తమ ఆవేదన అని ఎంపీ రఘురాంరెడ్డి అన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహకారం, రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి హామీలు నెరవేర్చలేదన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 03:03 AM