పార్లమెంటు వద్దు.. మునిసిపల్ పోరే ముద్దు !
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:05 AM
పార్లమెంటు సమావేశాల కంటే రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలకే తెలంగాణ ఎంపీలు ప్రాధాన్యమిస్తున్నారా?
ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ ఎంపీల గైర్హాజరు
అభ్యర్థుల ప్రచారంలోనే బిజీబిజీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు సమావేశాల కంటే రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలకే తెలంగాణ ఎంపీలు ప్రాధాన్యమిస్తున్నారా? బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రం తరఫున మాట్లాడటం కంటే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికే సై అంటున్నారా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది. తెలంగాణలో ఈ నెల 11న జరగబోయే మునిసిపల్ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ ఎంపీలకు ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించాయి. దీంతో రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలంతా ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. జనవరి 28న ప్రారంభమైన తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఎంపీల హాజ రు చాలా తక్కువగా నమోదవుతోంది. సమావేశాల తొలి రోజు, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే రాష్ట్ర ఎంపీలు కొందరు ఢిల్లీలో కనిపించారు. కొందరు ఎంపీలు అసలు పార్లమెంట్ వైపే చూడకపోవడం గమనార్హం. మునిసిపల్ ఎన్నికల ప్రచారం ఈ నెల 9తో ముగుస్తుంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13న ముగుస్తాయి. దీంతో చాలా మంది ఎంపీలు ఈ నెల 10 నుంచి సభకు హాజరయ్యే అవకాశముంది. కాగా, కాం గ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.