Share News

సినిమా టికెట్లకు సీలింగ్‌! థియేటర్లలో కనిష్ఠ, గరిష్ఠ ధరలను నిర్ణయించిన ప్రభుత్వం..

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:44 AM

తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలు, థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్‌ స్క్రీన్, స్పెషల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో..

సినిమా టికెట్లకు సీలింగ్‌! థియేటర్లలో కనిష్ఠ, గరిష్ఠ ధరలను నిర్ణయించిన ప్రభుత్వం..

  • నాన్‌ ఏసీ, ఏసీ, స్పెషల్‌, మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ధరలు ఖరారు

  • రూ.100 కోట్లు దాటితే సూపర్‌ హై బడ్జెట్‌ సినిమాగా గుర్తింపు

  • ఈ సినిమాలకు తొలి 10రోజులు టికెట్ల రేట్లు పెంచుకొనే చాన్స్‌

  • సినీ కార్మికుల నిధికి కోటి విరాళం ఇచ్చే సినిమాలకే ధరల పెంపు

  • రోజుకు 5 షోలకు అవకాశం.. అందులో కనీసం ఒక షో చిన్న సినిమా ఉండాలి

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలు, థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్‌ స్ర్కీన్‌, స్పెషల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో నిర్దిష్టమైన టికెట్‌ ధరలను ఖరారు చేస్తూ హోంశాఖ జీవో ఎంఎస్‌ నెం. 77 జారీ చేసింది. 2021 తర్వాత సింగిల్‌ స్క్రీన్ థియేటర్లలో టికెట్ల ధరలను పెంచారు. మల్టీప్లెక్స్‌లలో ధరలను యథాతథంగా ఉంచారు. స్పెషల్‌ థియేటర్లు అనేదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. 7.1 సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌, 2కే లేదా 4కే ప్రొజెక్షన్‌, కనీసం 75 అడుగుల తెర ఉన్న థియేటర్లను స్పెషల్‌ క్యాటగిరీలో చేర్చింది. ఉదయం 8 గంటల నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకొనేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక చిన్న సినిమాను ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. రూ.100 కోట్లకుపైగా బడ్జెట్‌తో తీసే సినిమాలను సూపర్‌ హై బడ్జెట్‌ సినిమాలుగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి సినిమాలకు మొదటి పది రోజులు మాత్రమే టికెట్‌ ధరలు పెంచుకొనేందుకు అవకాశం ఇచ్చింది. అది కూడా సినీ కార్మికుల సంక్షేమ నిధికి రూ.కోటి విరాళం ఇచ్చే సినిమాలకు మాత్రమే టికెట్‌ ధరలు పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే, ఎంతమేర టికెట్‌ ధరలు పెంచుకోవచ్చన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.


ఆన్‌లైన్‌లో బుక్‌చేసే టికెట్లకు ఏసీ థియేటర్‌ అయితే రూ.5, నాన్‌ ఏసీ థియేటర్‌ అయితే రూ.3 చొప్పున నిర్వహణ చార్జీలుగా నిర్ణయించింది. కాగా, టికెట్‌ ధరల పెంపుతో అదనపు ఆదాయం సమకూర్చుకున్న నాలుగు సినిమాల నిర్మాతలు తమ అదనపు ఆదాయం నుంచి 20శాతం డబ్బును తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల సంక్షేమ నిధికి చెల్లించాల్సిందిగా ఆయా సినీ నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. అఖండ-2, ది రాజాసాబ్‌, మన శంకర్‌ వరప్రసాద్‌ గారు, పెద్ది సినిమా టికెట్‌ ధరల పెంపుతో వచ్చిన అదనపు ఆదాయంపై 20ు సంక్షేమ విరాళంగా ఇవ్వాలని లేఖలో పేర్కొంది.


సవరించిన టికెట్‌ ధరలు.

  • నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం క్యాటగిరీ టికెట్‌ ధర కనిష్ఠంగా రూ. 30, గరిష్ఠంగా రూ.70. ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ. 50, గరిష్ఠంగా రూ. 100.

  • ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ. 150. ఏసీ థియేటర్లలో ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠ ధర రూ. 200.

  • స్పెషల్‌ థియేటర్లలో నాన్‌ ప్రీమియంలో కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ. 250. ప్రీమియం, రిక్లైనర్‌ కనిష్ఠ ధర రూ.200, గరిష్ఠ ధర రూ.300.

  • మల్టీప్లెక్స్‌లు రెగ్యులర్‌ కనిష్ఠ ధర రూ.100, గరిష్ఠ ధర రూ.250, రిక్లైనర్‌ కనిష్ఠం రూ. 200, గరిష్ఠ ధర రూ.300.

Updated Date - Aug 20 , 2026 | 05:50 AM