ఉద్యమకారులకు ఎలాంటి సాయం చేయాలి?
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:26 AM
తెలంగాణ ఉద్యమంతో మమేకమైన వారందరినీ పిలిచి మాట్లాడుతామని, ఉద్యమకారులకు ఎలాంటి సాయం చేయాలనేది ప్రభుత్వానికి నివేదిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తెలిపింది.
ఉద్యమంతో మమేకమైనవారందరితో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం
తొలుత గుర్తింపు.. ఆ తర్వాతే సాయంపై నిర్ణయం
తొలిదశ ఉద్యమకారులనూ గుర్తిస్తాం: గుర్తింపు కమిటీ
అఖిలపక్ష భేటీలో అభిప్రాయాల సేకరణ
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంతో మమేకమైన వారందరినీ పిలిచి మాట్లాడుతామని, ఉద్యమకారులకు ఎలాంటి సాయం చేయాలనేది ప్రభుత్వానికి నివేదిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తెలిపింది. గురువారం అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలతో మాట్లాడామని, మున్ముందు ప్రజాసంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ జేఏసీలు, న్యాయవాదులు, వైద్యులు, రచయితలు, జర్నలిస్టులు, కవులు, కళాకారులందరినీ పిలిచి, వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుంటామని వివరించింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీల అభిప్రాయాలను కమిటీ సేకరించింది. కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రి పొన్నం, ఎమ్మెల్సీలు కోదండరామ్, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తొలితరం ఉద్యమంతో అనుబందమున్నవారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నవారిని కూడా గుర్తించాలని అభిప్రాయపడ్డాయి. కె.కేశవరావు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాన్న ఉద్దేశంతో ప్రభుత్వం తమ కమిటీని వేసిందన్నారు. అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వంటి అన్ని పార్టీల నేతలను పిలిచి మాట్లాడామన్నారు. ఉద్యమంలో జర్నలిస్టులు, కళాకారులు, రచయితలు, కుల సంఘాలు, ఉద్యోగులు, మహిళా సంఘాలు వంటి చాలా సంఘాలు భాగస్వాములై ఒక్కో రకంగా నష్టపోయామని పొన్నం పేర్కొన్నారు. అలాంటివారిని సముచితంగా గౌరవించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉద్యమకారుల జేఏసీల నేతలు, అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీలతో కమిటీ సమావేశమవుతుందని కోదండరామ్ చెప్పారు. ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, కుల సంఘాలు, జేఏసీల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందని అద్దంకి దయాకర్ అన్నారు. కాగా తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపు, సంక్షేమం కోసం జార్ఖండ్ తరహాలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కె. కేశవరావు కమిటీని టీజేఎస్ పార్టీ కోరింది. సమావేశంలో పాల్గొన్న టీజేఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఈ మేరకు సమగ్ర నివేదికను అందజేశారు.