రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల ఎంపిక జరగాలి
ABN , Publish Date - May 18 , 2026 | 03:05 AM
రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక జరగాలని, గతంలో జరిగిన అసమానతలు పునరావృతం కాకుండా చూడాలని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ పేర్కొంది.
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు
అర్హుల గుర్తింపుకు 4 కేటగిరీల ప్రతిపాదన
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక జరగాలని, గతంలో జరిగిన అసమానతలు పునరావృతం కాకుండా చూడాలని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం నియమించిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో కమిటీ చైర్మన్ కె. కేశవరావు నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్నవారిని గుర్తించడానికి కమిటీ నాలుగు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యంగా, గాయపడిన వారిని రెండో కేటగిరీలో.. జైలుకు వెళ్లిన వారు, కేసు లు ఎదుర్కొన్నవారిని మూడో కేటగిరీలో తీసుకోవాలని సూచించింది. క్షేత్రస్థాయిలో పాల్గొన్న వారికి నాలుగో కేటగిరి ఇవ్వాలని ప్రతిపాదించింది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, 1969 ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, న్యాయవాదుల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించిన అనంతరం.. కమిటీ ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు.