మంచు కొండల్లో.. సాహసం శ్వాసగా..
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:49 AM
రాష్ట్రానికి చెందిన పర్వతారోహకులు అరుదైన ఘనత సాధించారు. ఉత్తరఅమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన మౌంట్ డెనాలీ పర్వతాన్ని...
-25 డిగ్రీల చలిని జయించి ‘డెనాలీ’పై జెండా
‘సెవెన్ సమిట్’ పూర్తి చేసిన తొలి దక్షిణాది డా. రాజశేఖర్
ఏడు ఖండాల లక్ష్యంలో ఆరు శిఖరాలు అధిరోహించిన అన్విత
హైదరాబాద్ సిటీ /భువనగిరి టౌన్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన పర్వతారోహకులు అరుదైన ఘనత సాధించారు. ఉత్తరఅమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన మౌంట్ డెనాలీ పర్వతాన్ని హైదరాబాద్‌కు చెందిన డా. రాజశేఖర్, యాదాద్రి భువనగిరికి చెందిన పడమటి అన్విత అధిరోహించి జాతీయ జెండా ఎగురవేశారు. మైనస్ 25డిగ్రీల గడ్డ కట్టే చలిని, ఉధృత గాలులను తట్టుకుంటూ పట్టుదలతో విజయం సాధించారు. ప్రస్తు తం వీరిందరూ సురక్షితంగా బేస్ క్యాంపుకు చేరుకున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో తమ స్వస్థలాలకు చేరుకోనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జూన్ 18 గురువారం మౌంట్ డెనాలీ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. దీంతో ఏడు ఖండాలలో ఏడు అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ‘సెవెన్ సమిట్’ గ్రూపులో చేరడమే కాకుండా.. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది వైద్యుడిగా రికార్డు సృష్టించారు. రాజశేఖర్ ఈ స్థాయికి చేరడం వెనక పెద్ద పోరాటమే ఉంది. కొవిడ్ మహమ్మారి బారిన పడి ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. శారీరక అలసట, నిస్సహాయతతో ఏడాది పాటు వైద్యవృత్తికి దూరమయ్యారు. ఆ నిరాశ నుంచి బయటపడి, శారీరక ధృడత్వాన్ని పెంచుకోవడానికి ఆయన పర్వతారోహణను ఎంచుకున్నారు. 2022 జనవరి 26న టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని ఎక్కడంతో ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఐరోపాలోని మౌంట్ ఎల్‌బ్రస్, 2023లో ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసియాస్కో, 2024లో దక్షిణ అమెరికాలో మౌంట్ అకాన్ కగువా, మూడు నెలల్లోనే మౌంట్ ఎవరెస్,్ట అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ శిఖరాలను అధిరోహించారు. 2025 జూన్‌లో మౌంట్ డెనాలీని అధిరోహించడానికి వెళ్లిన ఆయన తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన మంచు కాటు(ఫ్రాస్ట్ బైట్)కు గురయ్యారు. అయినా వెనకడుగు వేయకుండా తనను తాను పునరావిష్కరించుకుంటూ మౌంట్ డెనాలీ చేరుకున్నారు. గతంతో పోలిస్తే యాత్ర కాస్త సాఫీగా జరిగిందని, ఈ ప్రయాణం శారీరక, మానసిక స్ధిరత్వాన్ని పరీక్షించిందని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.
గైడ్ లేకుండానే అన్విత సాహసయాత్ర
పడమటి అన్విత ఈ నెల 5న డెనాలీ పర్వతం బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. స్థానిక గైడ్, పోర్టర్ లేకుండానే.. అర్జెంటీనాకు చెందిన మరో మహిళా ప్రయాణికురాలితో కలిసి ఈనెల 7న సాహసయాత్ర చేపట్టారు. 20కిలోల బరువైన సామగ్రితో.. ఎముకలు కొరికే చలిలో ప్రయాణించి శుక్రవారం తెల్లవారుజామున డెనాలీ శిఖరాన్ని చేరుకున్నారు. ఐదు నెలల క్రితం ఇక్కడే వాతావరణం అనుకూలించక వెనుదిరిగిన అన్విత.. ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో 12రోజుల్లోనే ప్రయాణాన్ని ముగించారు. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలను(సెవెన్ సమిట్) అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్వితకు ఇది ఆరో శిఖరం. ఇక మౌంట్ కొసియాస్కో పర్వతాన్ని అధిరోహిస్తే ఆమె ఆశయం నెరవేరుతుంది. 2021లో ఎంబీఏ చేసిన అన్విత.. ప్రస్తుతం ట్రాన్సెండ్ అకాడమీలో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది.