Share News

అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:08 AM

రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో మరో నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వం ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసింది.

అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం

  • ఆవిష్కరించిన నూతన గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

  • ‘జయ జయహే తెలంగాణ’తో సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో మరో నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వం ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు గవర్నర్‌.. శాసనసభ ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సమావేశాలను తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’తో ప్రారంభించి.. జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఆలపించారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని విధిగా ఆలపించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో శాసనసభలో ఆ గేయాన్ని ఆలపించారు. ఇక తొలిరోజు సమావేశాల ముగింపు కూడా ‘జయ జయహే తెలంగాణ’ గీతాలాపనతోనే ముగిసింది. కాగా, బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు శాసనసభ ప్రాంగణం కళకళాడింది. రాష్ట్ర గవర్నర్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్‌ శుక్లా మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఒకే ప్రాంగణానికి రావడంతో కోలాహలంగా కనిపించింది. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించగా.. తొలిరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అసెంబ్లీ సమావేశ మందిరంలో కూర్చున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 1985లో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనంలో, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు పాత అసెంబ్లీ భవనం(హెరిటేజ్‌ భవనం, టౌన్‌హాల్‌)లో జరిగేవి. అయితే 2017లో ఏపీ అసెంబ్లీ వెలగపూడికి తరలిపోవడంతో పాత భవనం ఖాళీగా ఉండిపోయింది. 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక శాసన సభ, శాసనమండలి సమావేశాలను ఒకే ప్రాంగణంలో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో టౌన్‌హాల్‌కు మరమ్మతులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం భవనం తళతళ మెరిసిపోతోంది. మంగళవారం నుంచి ఇదే భవనంలో శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ సమావేశాలు ఎప్పటిలాగే 1985లో నిర్మించిన భవనంలోనే కొనసాగనున్నాయి. అయితే.. 2సభలకు కలిపి ఉమ్మడి లాబీలు ఉండడంతో ఇకపై లాబీలు కళకళలాడనున్నాయి. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, అధికారులతో అసెంబ్లీ ప్రాంగణమంతా కోలాహలంగా మారనుంది. సోమవారం కూడా ఉభయ సభల సభ్యులు తరలి రావడంతో సందడిగా కనిపించింది.

Updated Date - Mar 17 , 2026 | 04:08 AM