Share News

ఏరువాక వచ్చె.. వానే రాకపాయె!

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:41 AM

ఏరువాక పున్నమ! కాడెడ్లను అందంగా అలంకరించి.. వాటికి కడుపునిండా జొన్న గట్క, పోలెలు, మేత పెట్టి.. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు కట్టి..

ఏరువాక వచ్చె.. వానే రాకపాయె!

  • విత్తనాలు వేయాలా.. వద్దా? అని ఆలోచిస్తున్న రైతులు

  • ఆరుద్ర సగం గడిచిపోయినా జాడలేని వానలు

  • ఎల్‌నినో, నైరుతి ప్రభావంతో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకం

  • నిరుడు ఈ సమయానికి 29 లక్షల ఎకరాల్లో సాగు

  • ప్రస్తుతం 15 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు

  • రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ మినహా అంతటా అరకొర వానలే.. చాలాచోట్ల నారుమళ్లు వేయలే

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఏరువాక పున్నమ! కాడెడ్లను అందంగా అలంకరించి.. వాటికి కడుపునిండా జొన్న గట్క, పోలెలు, మేత పెట్టి.. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు కట్టి.. దుక్కులు దున్నేందుకు, విత్తనాలు వేసేందుకు తలకు రుమాలు చుట్టుకొని రైతన్నలు శివార్ల దిశగా జోరుగా హుషారుగా కదిలే పండుగ! సోమవారమే ఈ పర్వదినం! మరి.. ఈసారి రైతుల్లో ఆ ఖుషీ.. జోష్‌ కనిపిస్తున్నాయా? అంటే ఔను.. అని గట్టిగా చెప్పలేని పరిస్థితి! మృగశిర ఎప్పుడో వెళ్లిపోయింది. ఆరుద్ర కార్తె వచ్చి వారం గడిచిపోయింది!! అయినా వాన జాడ లేదు! నీటితో కళకళలాడాల్సిన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు వెలవెలబోతున్నాయి. నిండుగా పోయాల్సిన బోరుబావులు గుటకలు వేస్తున్నాయి. రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు మందకొడిగా సాగుతోంది. ఎల్‌నినో, నైరుతి విస్తరణ ప్రభావంతో వర్షాలు సరిపడా పడకపోవడంతో రైతులు విత్తనాలు వేయడానికి వెనుకాముందు ఆలోచిస్తున్నారు. ఈ సీజన్‌లో వానలు పడతాయా.. లేదా? అనే ఆందోళనతో ఆచితూచి పంటలు సాగుచేస్తున్నారు. నిరుడు ఖరీ్‌ఫలో ఈ సమయానికి 29 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయగా... ప్రస్తుతం 15 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగుచేయటం గమనార్హం. నిరుటితో పోలిస్తే 14 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో వర్షాలు ఎలా పడతాయి? పంటలసాగు ఏమేరకు పుంజుకుంటుంది? ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు జూన్‌ రెండో వారంలో ప్రవేశించాయి. 23 తేదీ నాటికి రాష్ట్రమంతటా వ్యాపించాయి. సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఈసారి 15 రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి రుతుపవాలు ప్రవేశించాయి. నైరుతి రాష్ట్రంలో విస్తరించినా... ఎక్కడా కూడా సమృద్ధిగా వర్షాలు పడిన దాఖలాల్లేలేవు. కొన్ని జిల్లాల్లో మాత్రమే అడపా దడపా వానలు పడుతున్నాయి. జూన్‌ మూడోవారం దాటేనాటికి రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 130.3 మి.మీ కాగా, 84.6 మి.మీ వర్షపాతమే నమోదైంది. ఇది సాధారణం కన్నా 17శాతం తక్కువ. రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ జిల్లాల్లో కాస్త ఎక్కువ వర్షపాతం, 13 జిల్లాల్లో సాధారణ, 15 జిల్లాల్లో లోటు వర్షపాతం, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో అయితే అత్యల్ప వర్షపాతం నమోదైంది. దీంతో వరి నార్లు పోయటం, పత్తి గింజలు నాటడం, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు సాగుచేయటం చాలావరకు తగ్గిపోయాయి. వ్యవసాయ బావులు, బోర్లు అందుబాటులో ఉన్న రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నారు. మిగిలిన రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. నిరుటితో పోలిస్తే ఈసారి వానాకాలంలో పంటల సాగు మందకొడిగా సాగుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే కేవలం 12 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి.


జిల్లాలవారీగా ఇదీ పరిస్థితి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చెరువులు, కుంటలతోపాటు వర్షాధార బోరుబావుల కింద కూడా సాగు గణనీయంగా తగ్గింది. ఇంతవరకు విత్తనాలు కూడా వేయలేదు. దేవాదుల, కాకతీయ కాలువల కింది భూముల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పత్తి సాగు తగ్గిపోయింది. ప్రాజెక్టులు, బోర్లలో నీళ్లు లేకపోవటంతో నారు మళ్లు కూడా పోయటంలేదు. ఉమ్మడి నల్లగొండ సాగు విస్తీర్ణం 13.20 లక్షలు కాగా... ఇందులో బోరుబావుల సాగు విస్తీర్ణం 4.50 లక్షలు ఉంటుంది. ఇప్పటివరకు 450 ఎకరాల్లో మాత్రమే నారుమళ్లు పోశారు. నాగార్జునసాగర్‌, మూసీ, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల కింద 9.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుల నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో రైతులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అడపా దడపా వానలు కురుస్తున్నా అవి పంటల సాగుకు సరిపోయే పరిస్థితిలేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఖరీఫ్‌ సాగు ప్రారంభంకాలేదు. వరి నార్లు పోయలేదు. పత్తి విత్తనాలు వేయలేదు. ఎల్‌ఎండీ జలాశయం అడుగంటిపోవటంతో కరీంనగర్‌ ప్రజలకు తాగునీరు, మానకొండూర్‌, కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాల రైతులకు సాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పరిస్థితి ఇలాగేఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. నిరుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించటంతో సాగువిస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 17 మండలాల్లో లోటు, మరో 15 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. కేవలం 52 వేల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పంటల సాగు గాడిలో పడుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంటలు సాగు ప్రశ్నార్థకంగా మారింది. పత్తి, మొక్కజొన్న పంటలు వేసినా నీళ్లు లేక కోలుకోవటంలేదు. ఇప్పటివరకు 70 శాతం విస్తీర్ణంలో విత్తనాలు వేయాల్సి ఉండగా... కేవలం 30 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి.


14.78 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు

వ్యవసాయశాఖ తాజాగా విడుదలచేసిన సాగు నివేదిక ప్రకారం రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 1,32,44,305 ఎకరాలు కాగా... ఇప్పటివరకు 14,78,120 ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు సాగుచేశారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఇదే సమయానికి 28,38,416 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నిరుటితో పోలిస్తే 13,60,296 ఎకరాల్లో పంటల సాగు తక్కువగా జరిగింది. వరి నాట్లు 30,243 ఎకరాల్లో వేశారు. పత్తి విత్తనాలు 12,60,315 ఎకరాల్లో నాటారు. 30,932 ఎకరాల్లో మొక్కజొన్న, 55,500 ఎకరాల్లో కందులు, 24,666 ఎకరాల్లో సోయాబీన్‌, 19,523 ఎకరాల్లో చెరకు, 3,992 ఎకరాల్లో జొన్న, 8,737 ఎకరాల్లో పెసర్లు, 3,801 ఎకరాల్లో మినుము, 678 ఎకరాల్లో వేరుశనగ పంటలు వేశారు. ఇతర పంటలన్నీ కలిపి 14.78 లక్షల ఎకరాల్లో సాగుచేశారు.

ప్రాజెక్టుల్లో నీరేది?

జలాశయాల్లో కూడా నీటి నిల్వలు తక్కువే ఉన్నాయి. సింగూరులో నిరుడు 19.26 టీఎంసీలు ఉండగా... ఇప్పుడు 4.50 టీఎంసీలే ఉన్నాయి. మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. నాగార్జునసాగర్‌ మాత్రమే నిరుటికన్నా రెండు టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి. శ్రీరాంసాగర్‌లో నీటినిల్వలు సమానంగా ఉన్నాయి. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు వెలవెలపోతున్నాయి. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలకు నీరు అందటంలేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభంలేదు. ఇక జూలై, ఆగస్టు నెలలపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. నాలుగు నెల వానాకాలం సీజన్‌లో ఒక నెల కాలం పోయింది!

Updated Date - Jun 29 , 2026 | 04:41 AM