Share News

సీట్లపైనే ముచ్చట్లు

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:33 AM

పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల పునర్విభజన చేపడతామని, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతుండడం రాజకీయ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది.

సీట్లపైనే ముచ్చట్లు

  • పునర్విభజనపై అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య జోరుగా చర్చ

  • ఎన్ని సీట్లు? ఎక్కడెక్కడ పెరుగుతాయి?.. పునర్విభజన జనాభా ప్రాతిపదికన ఉంటుందా?

  • అధికార, ప్రతిపక్ష లాబీల్లోనూ ఇదే అంశం.. తమ పార్టీకే లాభిస్తుందని ఎవరికి వారి అంచనాలు

  • సీట్లు పెరిగి.. ఓటర్లు తగ్గితే మంచిదేనని, ఖర్చు కూడా తగ్గుతుందని కొందరి ఆశాభావం

  • రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ కు పట్టు పెరుగుతుందని మరికొందరి అభిప్రాయం

హైదరాబాద్‌, మార్చి 25, (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల పునర్విభజన చేపడతామని, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతుండడం రాజకీయ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఈ అంశంపై ఆసక్తికర చర్చలు జరిగాయి. ఇటు అధికార పక్షంవైపు లాబీలతోపాటు ప్రతిపక్షం వైపు లాబీల్లోనూ ఇదే చర్చ నడిచింది. పునర్విభజనతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 179కి చేరవచ్చనే అంచనా ఉన్న నేపథ్యంలో.. అసలు ఎన్ని సీట్లు పెరుగుతాయి? ఎక్కడెక్కడ పెరుగుతాయి? అన్న చర్చ ఎమ్మెల్యేల మధ్య జరిగింది. జనాభా ప్రాతిపదికగానే ఈ సీట్లు పెరగవచ్చనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు. 2011 నాటి జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే ఎక్కడెక్కడ స్థానాలు పెరుగుతాయి? జిల్లాల వారీగా ఎన్ని పెరగొచ్చు? అన్న చర్చ నడిచింది. ఈ నిర్ణయం అధికార పార్టీకే ఎక్కువగా ప్రయోజనం కలిగిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సీట్లు కూడా దామాషాలో పెరుగుతాయన్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న రిజర్వుడు స్థానాలే కాస్త అటూ ఇటూగా భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశాలుంటాయన్నారు. మరోవైపు అధికార పార్టీలో అనేక మంది నేతలు ఉన్నారని, అందరికీ సర్దుబాటు చేయడం కొన్నిసార్లు కుదరదని, పునర్విభజన అన్నది ఈ సమస్యకు పరిష్కారంగా తమకు ఉపకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాయకులు ఎక్కువ మంది ఉన్నారని, ఈసారి తమ జిల్లాలోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయని ఆ జిల్లా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ జిల్లాలో భూముల విలువ పెరగడంతో రాజకీయాల్లోకి రావాలనే ఔత్సాహికులు కూడా చాలామంది ఉన్నారని, వారిలో కొందరికి ఇది అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.


బీఆర్‌ఎస్‌కు కలిసొస్తుందన్న కేటీఆర్‌..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనను కలిసిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ, ‘‘గత ఎన్నికల్లో మనం కొందరికి టికెట్లు సర్దుబాటు చేయలేకపోయాం. పునర్విభజన అలాంటి వారందరికీ పోటీచేసే అవకాశాలను కల్పిస్తుంది. ఇది మనకు కలిసొస్తుంది’’ అని అన్నారు. ఆ పార్టీ నేత హరీశ్‌రావు కూడా ఈ అంశంపై కొందరు ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. సీట్లు పెంచాలని, మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని గతం నుంచీ చెబుతున్నామని, ఈ పెంపు బీఆర్‌ఎ్‌సకే లాభిస్తుందని అన్నారు. అయితే అసెంబ్లీ సీట్ల పెంపు జనాభా ప్రాతిపదికన ఉంటుందా? లేదంటే జిల్లాల వారీగా ఇప్పుడున్న సీట్లు, వాటికి అదనంగా 50 శాతం పెంచేలా విధానం ఉంటుందా? అన్న సందేహాలను కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి హైదరాబాద్‌, ర ంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమ జిల్లాలో సీట్లు పెద్దగా పెరగవని, మూడు సీట్లు మాత్రమే పెరగవచ్చని అన్నారు. తాము జనాభాను నియంత్రించామని అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. పెరిగే సీట్లలో సగం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉంటాయని అత్యధికులు పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోనే జనాభా కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణమన్నారు. కాగా, ఈ పరిస్థితి పట్టణ పార్టీగా ఉండే తమకు కలిసొస్తుందని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్‌ శంకర్‌ చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా చూస్తే సీట్ల పెంపుతో దక్షిణాదికి ఎంతో కొంత నష్టమన్న భావన కొందరు ఎమ్మెల్యేల్లో ఉంది. పార్లమెంటుపై దక్షిణాది పట్టు సడలుతుందని వారు అన్నారు. మన రాష్ట్రంలో మాత్రం దక్షిణ తెలంగాణకు ఎక్కువ సీట్లు ఉంటాయని, రాష్ట్రంలో అధికారాన్ని దక్షిణ తెలంగాణనే నిర్ణయిస్తుందేమోనని చమత్కరించారు.


మహిళలు మరింత శ్రద్ధ చూపిస్తారు..

మహిళల ప్రాతినిధ్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిదేనన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. ‘‘మహిళల్లో సాధారణంగా ఓపిక ఎక్కువ. సావధానంగా సమస్యలు వింటారు. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారు. మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరగాలి’’ అని మంత్రి సీతక్క అన్నారు. అయితే ములుగు లాంటి ఒకే ఒక్క నియోజకవర్గం ఉన్న జిల్లాలో సీట్లు ఎలా పెరుగుతాయన్నది చూడాలన్నారు. మరోవైపు దక్షిణాదికి అన్యాయం విషయంలోనూ కొంత చర్చ జరిగింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగేదని, 50 శాతం విధానంతో ఎవరికీ నష్టం ఉండదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే 50 శాతం పార్లమెంటు స్థానాల పెంపు వల్ల కూడా దక్షిణాది ప్రభావం మరికాస్త తగ్గొచ్చని ఒకరిద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పలువురు కార్పొరేషన్‌ చైర్మన్లు కూడా లాబీల్లో ఈ చర్చపై ఆసక్తి చూపించారు. తాము కార్పొరేషన్‌ చైర్మన్ల వరకు వచ్చామని, సీట్ల సంఖ్య పెరిగితే ఒక మెట్టు ఎదిగేందుకు అవకాశం వస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌.. తనది ఫలానా నియోజకవర్గమని, వచ్చే ఎన్నికల్లో అవకాశాల కోసం ప్రయత్నించేందుకు గట్టి ప్రాతిపదిక చేతికి అందివస్తుందని చెప్పారు. కొందరు చైర్మన్లు మీది ఏ నియోజకవర్గం? ఏ జిల్లా? అక్కడ సీట్ల సంఖ్య పెరుగుదలకు ఉన్న అవకాశాలేంటి? అన్నదానిపై చర్చించుకున్నారు.

మంచిదే.. ఖర్చు తగ్గుతుంది

నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల సంఖ్య పెరగడం మంచిదేనని, పోటీ చేసేవారికి ఖర్చు తగ్గుతుందని అత్యధిక మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో 4లక్షల నుంచి 7.3 లక్షల వరకు ఓటర్లున్నారని, పోల్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్నికల మేనేజ్‌మెంట్‌కు చుక్కలు కనిపిస్తున్నాయని వాపోయారు. ఓటరుకు వెయ్యి, రెండు వేలు అని నిర్ణయించి పంచే సమయంలో ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నచోట్ల తడిసి మోపెడయ్యే పరిస్థితులున్నాయని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ జనాభా, ఓటర్ల సంఖ్య తగ్గితే ఖర్చులు కూడా తగ్గుతాయని, అదే సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించే వేగం కూడా పెరుగుతుందని కుత్పుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సీట్లు పెరుగుతాయని అంతా అంటున్నారని, కానీ పెరిగితే తమకూ మేలేనని శే రిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం తనదేనన్నారు. అయితే తొలుత మాత్రం ఇంతపెద్ద నియోజకవర్గం చిన్నదైపోయింన్న భావన కూడా ఉంటుందన్నారు. సీట్ల సంఖ్య పెరిగినప్పుడు ఒక్కో నియోజకవర్గంలో సగటున 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది ఓటర్లు ఉండే అవకాశాలుంటాయని పేర్కొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 05:33 AM