Share News

బీఆర్‌ఎస్‌ తప్పిదాలతోనే కూలేశ్వరం

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:24 AM

కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు రూ.వేల కోట్లు దోచుకొని ఇప్పుడు మళ్లీ డ్రామాలకు తెర లేపుతున్నారన్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమొత్తారు..

బీఆర్‌ఎస్‌ తప్పిదాలతోనే కూలేశ్వరం

  • వేలకోట్లు దోచుకుని డ్రామాలా?: పొంగులేటి

  • కన్నెపల్లి సందర్శన పేరుతో కేటీఆర్‌ రాజకీయ కుట్ర

  • బీఆర్‌ఎస్‌ వల్లే కాళేశ్వరం కుంగుబాటు: శ్రీధర్‌బాబు

  • కేటీఆర్‌ డ్రామాలను ప్రజలు నమ్మరు: సీతక్క

భూపాలపల్లి, ములుగు, సత్తుపల్లి, హైదరాబాద్‌ జూలై 5(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు రూ.వేల కోట్లు దోచుకొని ఇప్పుడు మళ్లీ డ్రామాలకు తెర లేపుతున్నారన్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమొత్తారు.. మీ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దొరల ప్రభుత్వం చిన్నాభిన్నం చేయగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం గాడిలో పెట్టి.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రెండేళ్లుగా అమలు చేస్తోందన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. గడిచిన పలు ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ప్రజలు బుద్ధి చెప్పారని, అయినా నిస్సిగ్గుగా ఒకాయన రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని అంటున్నారని విమర్శించారు. మరొక నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. అక్కడికి వెళ్లేందుకు డ్రామాలు చేస్తున్నారన్నారు. అసలు కాళేశ్వరం దుస్థితికి కారణం ఎవరు? మీరు కాదా? అని ప్రశ్నించారు.

మీ తప్పులను సరిదిదుతున్నాం..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అవినీతి, ఘోర తప్పిదాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌ సందర్శన పేరిట కేటీఆర్‌ బృందం మరో కొత్త కుట్ర రాజకీయానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్‌ పేరిట గత ప్రభుత్వం చేసిన తప్పులను మంత్రి ఎండగట్టారు. మేడిగడ్డలో నీళ్లు ఆపితే ఒత్తిడికి లోనై బ్యారేజీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఎన్‌డీఎ్‌సఏ హెచ్చరించడం వల్లే తాము నిల్వచేయడం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో లోపాల కారణంగా ఏర్పడిన వేలాది కోట్ల నష్టానికి బీఆర్‌ఎస్‌దే బాధ్యతగా పేర్కొన్నారు. మరమ్మతు పనులను 2028 నాటికి పూర్తిచేసి కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని శ్రీధర్‌బాబు ప్రకటించారు. కాగా, గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కూలేశ్వరంగా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సైతం వ్యాఖ్యానించారు. దీనిపై కేటీఆర్‌ ఆడుతున్న రాజకీయ డ్రామాలను ప్రజలు నమ్మరని విమర్శించారు. ఈ మేరకు ములుగు జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాగా, అరెస్టు చేస్తే సానుభూతి పొందవచ్చునన్న ఆలోచనతోనే కేటీఆర్‌ కాళేశ్వరం పర్యటన డ్రామాలాడుతున్నారని మండలిలో ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌.. అందులో దూకినా రాష్ట్రానికి జరిగే నష్టం ఏమీ లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్‌ అన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 03:24 AM