‘మద్దతు’పై ప్రకటనలే.. ధాన్యం కొనడంలేదు
ABN , Publish Date - May 15 , 2026 | 05:00 AM
కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు ప్రకటించడం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు...
పైగా కొనుగోళ్లపై పలు ఆంక్షలు.. కేంద్రంపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి విమర్శలు
అయినా చివరిగింజ వరకూ కొంటాం
పది రోజుల్లో పూర్తి చేస్తాం
రైతులకు భరోసా
ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల పరిశీలన
అధికార్లతో సమీక్ష
ఖమ్మం, నల్గొండ, మే 14 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు ప్రకటించడం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆరోపించారు. పైగా ధాన్యం కొనుగోళ్లపై అనేక ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరి గింజ వరకూ కొనుగోలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామని తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు, నల్గొండ జిల్లా కనగల్ మండలం చర్లగౌరారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఉత్తమ్, ఇతర మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార్లతో కలిసి పరిశీలించారు. సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఖమ్మంలో జరిగిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సమీక్ష సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ వేసవిలో 65 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, 140లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. పౌరసరఫరాల శాఖల ద్వారా 80లక్షల నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయబోతున్నామని చెప్పారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తరుగు, కటింగ్‌లు చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నల్గొండ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ధాన్యం రవాణాకు మినీలారీలు (డీసీఎంలు), ట్రాక్టర్లను సైతం వినియోగించాలని, ఈ విషయంలో కలెక్టర్లకు పూర్తి అధికారం ఇచ్చామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే బెంగాలీ హమాలీలు ఎన్నికల కోసం ఆ రాష్ట్రానికి వెళ్లారని, దీంతో కూలీల సమస్య తలెత్తిందని తెలిపారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. వర్షాలు రానున్నందున అన్ని జిల్లాల్లో గడువులో కొనుగోళ్ల ప్రక్రియను ముగించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ధాన్యం భారీగా దిగుబడి రావడంతో కొనుగోళ్లలో ఆటంకాలు వచ్చాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రతి మిల్లు వద్ద ఒక అధికారిని నియమించాలని సూచించారు.