Share News

పురపోరులో మంత్రులంతా పాస్‌!

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:24 AM

పురపాలక పోరులో మంత్రులందరూ పాస్‌ అయ్యారు. ముఖ్యమంత్రితోపాటు మిగిలిన మంత్రులు... తమ నియోజకవర్గాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపారు.

పురపోరులో మంత్రులంతా పాస్‌!

  • వారి నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీలన్నీ హస్తగతం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పురపాలక పోరులో మంత్రులందరూ పాస్‌ అయ్యారు. ముఖ్యమంత్రితోపాటు మిగిలిన మంత్రులు... తమ నియోజకవర్గాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలోని కొడంగల్‌ మునిసిపాలిటీని కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి నియోజకవర్గమైన మధిర మునిసిపాలిటీనీ కాంగ్రెసే గెలుచుకుంది. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి ఇద్దరూ తమ పరిధుల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఉత్తమ్‌ నియోజకవర్గంలో కోదాడ, హాలియా మునిసిపాలిటీలు, కోమటిరెడ్డి నల్లగొండ కార్పొరేషన్‌లోనూ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తన అసెంబ్లీ పరిధిలోకి వచ్చే మంథని మునిసిపాలిటీలో భారీ విజయంతో కాంగ్రెస్‌ జెండా ఎగరవేశారు. ములుగు మునిసిపాలిటీలో కాంగ్రెస్‌ గెలుపులో సీతక్క కీలకపాత్ర పోషించారు. తన నియోజకవర్గంలోని ఆందోల్‌ మునిసిపాలిటీలో హస్తం పార్టీని దామోదర రాజనరసింహ గెలిపించుకున్నారు. మక్తల్‌ మునిసిపాలిటీని వాకిటి శ్రీహరి, కొల్లాపూర్‌ మునిసిపాలిటీని జూపల్లి, ధర్మపురి మునిసిపాలిటీని లక్ష్మణ్‌ కుమార్‌, చెన్నూరును వివేక్‌, హుస్నాబాద్‌ను పొన్నం ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో చేజిక్కించుకున్నారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మునిసిపల్‌ ఎన్నికలు జరగలేదు. అయితే తుమ్మల తన పాత నియోజకవర్గమైన సత్తుపల్లిలోని సత్తుపల్లి, కల్లూరు మునిసిపాలిటీల్లో ప్రచారం చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. పొంగులేటి ఇన్‌చార్జిగా పనిచేసిన కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రె్‌సకు జవసత్వాలు సమకూర్చి హంగ్‌ పరిస్థితికి తీసుకొచ్చారు.

Updated Date - Feb 14 , 2026 | 04:24 AM