అవును.. ఇది మా అయ్య జాగీరే
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:24 AM
మిస్టర్ పవన్ కళ్యాణ్.. అవును ఇది మా అయ్య జాగీరే. నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల అయ్య జాగీరు. నీ అయ్య జాగీరేం కాదు! ఆంధ్రాలోనే నీకు దిక్కు లేదు. 2019 ఎన్నికల్లో నీ పార్టీకి డిపాజిట్టూ గల్లంతైంది.
తెలంగాణ ప్రజల అయ్య జాగీరు.. గద్దర్‌కు కారు కొనిచ్చానంటున్నడు
పవన్ అహంకారంపై దళిత వర్గాలు ఆలోచన చేయాలి: మంత్రి పొన్నం
పవన్ వ్యాఖ్యలతో రక్తం మరుగుతోంది
ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోం: మంత్రి కోమటిరెడ్డి
పవన్‌ను ఎవరో నడిపిస్తున్నారు: మహేశ్
హైదరాబాద్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ‘‘మిస్టర్ పవన్ కళ్యాణ్.. అవును ఇది మా అయ్య జాగీరే. నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల అయ్య జాగీరు. నీ అయ్య జాగీరేం కాదు! ఆంధ్రాలోనే నీకు దిక్కు లేదు. 2019 ఎన్నికల్లో నీ పార్టీకి డిపాజిట్టూ గల్లంతైంది. టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తే కానీ సీట్లు రాలేదు. అక్కడే ఏమీ చేయలేక పోతున్న నువ్వు ఇక్కడికి వచ్చి చేసేదేముంది?’’ అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. గద్దర్‌కు తాను కారు కొనిచ్చానని పవన్ కల్యాణ్ చెబుతున్నారని.. ఆయన అహంకారంపై రాష్ట్రంలోని దళిత వర్గాలు ఆలోచన చేయాలని పొన్నంపేర్కొన్నారు. ఏ అహంకారానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో.. అదే ఆధిపత్యం, అహంకారంతో పవన్ మాట్లాడుతున్నారన్నారు. ‘‘హైదరాబాద్ రావాలంటే పాస్‌పోర్ట్ తీసుకోవాలా’’ అని మాట్లాడుతున్న పవన్ ముందు తన ఆలోచనా ధోరణిని మార్చుకుంటే మంచిదన్నారు. తలుపులు వేసి తెలంగాణ బిల్లును ఆమోదించుకున్నారనడం ద్వారా పవన్ తెలంగాణపై తన అక్కసును వెళ్లగక్కారని మండిపడ్డారు. శాససనభ సభ్యుడైన పవన్ కళ్యాణ్‌కు పార్లమెంటు గురించి ఐడియా లేదని.. పార్లమెంటులో ఏ బిల్లునైనా తలుపులు మూసే ఆమోదిస్తారని పేర్కొన్నారు. ‘‘తెలంగాణపై తనకు ప్రేమ ఉందంటున్న పవన్.. తెలంగాణకు మద్దతుగా ఎన్నడైనా మాట్లాడాడా? తెలంగాణ కోసం యువత చనిపోతుంటే ఎప్పుడైనా సంఘీభావం తెలిపాడా? ‘చనిపోవద్దు.. ధైర్యంగా పోరాడి తెలంగాణ తెచ్చుకోండ’ని చెప్పాడా? పైగా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదన్నాడు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన పవన్ కల్యాణ్.. తెలంగాణ గురించి మాట్లాడితే ఎలా?’’ అంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని, తన దగ్గర డబ్బులుంటే తానూ ఆయనతో ఒక క్యారెక్టర్ చేయిస్తానని ఎద్దేవా చేశారు.
ఆయన తెలంగాణకు రాకపోకలు సాగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, కానీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కెలికి మరీ నవ నిర్మాణ సభ పెడతానంటే ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు. ఆంధ్రా ప్రాంత ప్రజలకు తాము ఎన్నడూ వ్యతిరేకం కాదని, వారికి స్వాగతం పలుకుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తే తెలంగాణ గెస్ట్‌గా ప్రోటోకాల్ ఇచ్చామని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలోనూ ఆంధ్రా ప్రజలను తాము ఏమీ అనలేదని, కానీ ఏదో అన్నట్లు పవన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. సినీ ఆర్టిస్టుగా పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరిగినా తమకు అభ్యంతరం లేదని, ఆర్టిస్టులను తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు. పేమెంట్ తీసుకుని రాజకీయాలు మాట్లాడితే.. తెలంగాణ వారిని వేర్పాటువాదులతో పోలిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఇక.. గ్లామర్ కాపాడుకోవడం కోసమే పవన్ హైదరాబాద్‌లో ఉంటున్నారని, నల్లగా అయిపోతాననే భయంతోనే విజయవాడ వెళ్లట్లేదని అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేశారు. సినిమాలు, రాజకీయాల్లోనూ ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన వారికే పవన్ మద్దతు ఇస్తారన్నారు. జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ఆయనకే మద్దతు ఇస్తారన్నారు.
అవతరణ దినోత్సవాన అక్కసు..
‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అని పవన్‌కల్యాణ్ మాట్లాడిన మాటలు వింటుంటే తన రక్తం మరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అంతా సంబురాలు జరుపుకొంటుంటే.. ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ గడ్డపై నిలబడి తన అక్కసును వెళ్లగక్కాడని దుయ్యబట్టారు. తెలంగాణ అంటే అణువణువునా అదే ద్వేషం, అదే వివక్ష ఇంకా వారి మాటల్లో స్పష్టంగా కనబడుతోందని ధ్వజమెత్తారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని.. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిస్తే మాత్రం సహించబోమన్నారు. ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోమన్న కోమటిరెడ్డి.. అందుకోసం ఎలాంటి చట్టం తేవడానికైనా వెనుకాడబోమని స్పష్టంచేశారు. తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తామని, బరిగీసి నిలబడతామన్నారు. పవన్ ఓ పార్ట్ టైమ్ పొలిటికల్ లీడర్ అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు పవన్ నిజస్వరూపం తెలుసుకోలేనంత అమాయకులు కారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. పవన్‌ను సినీ నటుడిగా అభిమానిస్తామని, కానీ రాజకీయంగా మాత్రం విభేదిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఆయన వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని ఎమ్మెల్యే మందుల సామేలు హెచ్చరించారు. తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్రా పాలకుల జోక్యాన్ని సహించేది లేదని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం మండిపడ్డారు.