ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
ABN , Publish Date - May 05 , 2026 | 03:59 AM
రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతుల ధాన్యం తడవకుండా ...
కల్లాల్లో ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలి
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతుల ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు రావటం, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్లు, అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్చువల్‌గా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రవాణాశాఖ కమిషనర్ ఇలంబరితి, కార్మికశాఖ కమిషనర్ దాసరి హరిచందన ఈ సమీక్షలో పాల్గొన్నారు. అకాల వర్షాలతో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో వరి పంట తడిసిందని, నల్లగొండ జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 299 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు నివేదిక వచ్చినట్లు ఉత్తమ్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే పారాబాయిల్డ్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ షీట్లు సిద్ధంగా ఉంచాలని, మూడు, నాలుగు రోజులు అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. 18.5 కోట్ల గోనె సంచులు(గన్నీ బ్యాగులు) సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రవాణా సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.