మొక్క జొన్నను ‘పీఎస్ఎస్’లో చేర్చండి
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:09 AM
మొక్కజొన్న పంటను మద్దతు ధర పథకం(పీఎస్ఎస్)లో చేర్చి, కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు తుమ్మల లేఖ
హైదరాబాద్/ఖమ్మం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంటను మద్దతు ధర పథకం(పీఎస్ఎస్)లో చేర్చి, కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు సోమవారం కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ప్రస్తుత యాసంగిలో 11.21 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేయగా, 29.79 లక్షల టన్నుల పంట వచ్చినట్లు అంచనాలున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం క్వింటాల్ మక్కల ధర రూ.1,759 మాత్రమే ఉన్నదని తెలిపారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 2,400తో పోలిేస్త రూ.641 తక్కువగా ఉందని తెలిపారు. ఈపరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని వివరించారు. మొత్తం ఉత్పత్తిలో సగమైనా కొనుగోలు చేయాలని కోరారు. ఇందుకు రూ.4వేల కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఈఏడాది రూ.23వేల కోట్లు జమచేశామని, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో 500మంది మైనారిటీ మహిళలకు ఆయన కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా తుమ్మల మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం 10వేలకోట్లు ఖర్చుపెట్టిందని గుర్తు చేశారు.