Share News

‘సాంకేతికత’ సాగులో తెలంగాణ ఆదర్శం: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:59 AM

పంటల సాగులో సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందే ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు..

‘సాంకేతికత’  సాగులో తెలంగాణ ఆదర్శం: మంత్రి తుమ్మల

  • పత్తి కొనుగోలు 15 రోజులు పొడిగించాలని సీసీఐకి లేఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పంటల సాగులో సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందే ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తద్వారా ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి దూరదృష్టి వల్లే వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆధారిత సంస్కరణలు వేగంగా అమలవుతున్నాయన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో ‘తెలంగాణ వ్యవసాయశాఖ ప్రస్తావన’ వచ్చిన నేపథ్యంలో మంత్రి తుమ్మల శుక్రవారం ఓ ప్రకటన చేస్తూ.. జర్మనీ అగ్రికల్చర్‌ కౌన్సిలర్‌ సహా అంతర్జాతీయ నిపుణులు తెలంగాణలో అమలవుతున్న సాంకేతిక విధానాలను ప్రశంసించడం విశేషమని, రాష్ట్రానికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు. రైతులకు సమయానికి ఎరువుల పంపిణీకి తమ సర్కారు మొబైల్‌ యూరియా బుకింగ్‌ యాప్‌ను తీసుకొచ్చిందన్నారు. తద్వారా యూరియా బ్లాక్‌ మార్కెటింగ్‌తోపాటు అధిక నిల్వలను నియంత్రిస్తూ పారదర్శక పంపిణీ పంపిణీ వ్యవస్థ అమల్లోకి వచ్చిందని ఆయన చెప్పారు. శాటిలైట్‌ ఉపగ్రహాల సహకారంతో మట్టిలో గల పోషకాలను గుర్తించి.. ఏఐ మోడలింగ్‌ ద్వారా వాటి విశ్లేషణకు పైలట్‌ ప్రాజెక్టును చేపట్టామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలు చేసి రైతులకు ఖచ్చితమైన మట్టి విశ్లేషణ, పంటల సాగుకు శాస్త్రీయ సలహాలు అందిస్తామన్నారు. కనీసం మరో 15 రోజులు పత్తి కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంచాలని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ని మంత్రి తుమ్మల కోరారు. రాష్ట్రంలో రైతులు పూర్తిగా పత్తిని విక్రయించలేదని, పూర్తిగా విక్రయించే వరకూ తెరిచి ఉంచాలని సీసీఐ సీఎండీ లలిత్‌ కుమార్‌ గుప్తా, కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ కుమార్‌లకు లేఖ రాశారు.

Updated Date - Feb 21 , 2026 | 02:59 AM